EPFO | ఈపీఎఫ్‌పై వడ్డీ 8.25% కొనసాగిస్తారా? మార్చి 2న కీలక సమావేశంలో నిర్ణయం

దేశంలోని సుమారు 6 కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు FY26లో వడ్డీపై కీలక నిర్ణయాన్ని ఈపీఎఫ్‌వో బోర్డు మార్చి 2న వెలువరించనున్నది.

epf-interest-rate-fy26-update

EPFO | దేశంలోని ఆరుకోట్ల మందికిపైగా ఉన్న ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకునే దిశగా ట్రస్ట్‌ ఆలోచనలు చేస్తున్నది. ఈపీఎఫ్‌ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న 8.25 శాతం వడ్డీరేటును రాబోయే ఆర్థిక సంవత్సరం (FY26) కూడా కొనసాగించాలని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ మేరకు బిజినెస్‌లైన్‌ బుధవారం ఒక కథనాన్ని పబ్లిష్‌ చేసింది. అయితే.. దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మార్చి 2న ఈపీఎఫ్‌వో ఉన్న స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది.

వడ్డీరేటును యథాతథంగా కొనసాగించాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించినట్టయితే.. పీఎఫ్‌ ఖాతాదారులు వరుసగా మూడో ఏడాది 8.25 శాతం వడ్డీని పొందే అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి అంతర్జాతీయంగా, దేశీయంగా సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న క్రమంలో యథాతథ స్థితి కొనసాగింపును స్థిరత్వానికి సంకేతంగా భావిస్తున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటును యథాతథంగా కొనసాగించడానికి తన పెట్టుబడుల నుంచి తగిన మిగిలు నిధులు ఉన్నాయని బిజినెస్‌ టుడే కథనం పేర్కొంటున్నది. అయితే.. మధ్యస్తకాలంలో అదే రాబడి కొనసాగించడానికి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ రాబడులు ఒత్తిడికి గురైతే.. తదుపరి సంవత్సరాల్లో వడ్డీ రేటు తగ్గే అవకాశాలను తోసిపుచ్చేలేమని అంటున్నారు.

ఈపీఎఫ్‌వో ప్రస్తుతం 28 లక్షల కోట్ల రూపాయలకు పైగా కార్పస్‌ ఫండ్‌ను నిర్వహిస్తున్నది. ఒక విధంగా దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్‌ ఫండ్‌ ఇదే. దాని పెట్టుబడి వ్యూహాలు చాలా పక్కగా ఉంటాయి. 45 % నుంచి 60 % వరకూ ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20%–45% ఇతర రుణ పత్రాల్లో, ఐదు నుంచి 15 శాతం వరకూ ఈక్విటీల్లో (ఈటీఎఫ్‌ ద్వారా), గరిష్ఠంగా ఐదు శాతం వరకూ షార్ట్‌ టెర్మ్‌ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెడుతూ ఉంటుంది. తద్వారా మూలధన భద్రతను కాపాడుకుంటూనే కొంత అదనపు లాభాలు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

ప్రభుత్వ బాండ్లు, హైగ్రేడ్‌ డెట్‌ పేపర్లలో అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల.. మార్కెట్‌లో ఒక్కసారిగా ఎదురయ్యే పతనాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇక పరిమిత ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ వల్ల షేర్‌ మార్కెట్‌ బుల్లిష్‌గా ఉన్న సమయంలో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే.. ఒకవైపు సేఫ్టీ.. మరోవైపు గ్రోత్‌ మధ్య సమతుల్యాన్ని సాధించే వ్యూహంగా నిపుణులు పేర్కొంటున్నారు.

సాధారణంగా వడ్డీరేటుపై ప్రతిపాదనను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (CBT) సమీక్షిస్తుంటుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో సంబంధిత మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఉన్నారు. చివరిసారిగా 2025 అక్టోబర్‌ 15న సమావేశమైన బోర్డు.. పీఎఫ్‌ ఉపసంహరణల ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. రాబోయే సమావేశంలో కూడా కొన్ని అదనపు పాలనాసంస్కరణలపై పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇందులో ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో కీలకమైన టెక్నాలజీ అప్‌డేట్స్‌ కూడా ఉన్నాయి. వాటితో క్లెయిమ్‌ సెటిల్మెంట్స్‌ మరింతవేగంగా, సజావుగా, పారదర్శకంగా సాగిపోతాయి. అయితే.. మార్చి 2 సమావేశ అధికారిక అజెండా ఇంకా ఖరారు కాలేదని సమాచారం.

మార్కెట్‌ ఒడిదుడుకులకు గురైన సమయంలో కూడా సభ్యులకు స్థిరమైన వడ్డీని ఇవ్వడానికి ప్రత్యేక రిజర్వ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసే ఆలోచనలో ఈపీఎఫ్‌వో ఉన్నట్టు సమాచారం. లాభాలు తగ్గిన సంవత్సరాల్లో కూడా సభ్యులకు స్థిరమైన వడ్డీ ఇచ్చేందుకు తద్వారా వీలుంటుంది.

దేశంలో ఆరుకోట్ల మందికిపైగా ఈపీఎఫ్‌వోలో సభ్యులు. వడ్డీపై బోర్డు తీసుకోబోయే నిర్ణయం వీరందరికీ ప్రయోజనం కల్పిస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు.. ఈపీఎఫ్‌ ఖాతాలో ఐదు లక్షల బ్యాలెన్స్‌ ఉంటే.. 8.25% వడ్డీతో సుమారు 41,250 రూపాయల వరకూ వార్షిక వడ్డీ (నెలవారీ బ్యాలెన్స్‌, తాజా కాంట్రిబ్యూషన్‌లపై ఆధారపడి) లభిస్తుంది.

ఇవి కూడా చదవండి.. 

GHMC Trifurcation : జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్
రాజగోపాల్‌ రెడ్డికి త్వరలో హైకమాండ్‌ నుంచి పిలుపు వస్తుందా? మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యల వెనుక…
Supreme Court On Freebies : ఉచిత పథకాలు..అభివృద్ధికి ఆటంకాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Latest News