రాజగోపాల్‌ రెడ్డికి త్వరలో హైకమాండ్‌ నుంచి పిలుపు వస్తుందా? మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యల వెనుక…

రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి, వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై హైకమాండ్‌తో చర్చించామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరలో పార్టీ ఆయనను పిలిచి మాట్లాడనుంది.

రాజగోపాల్‌ రెడ్డికి త్వరలో హైకమాండ్‌ నుంచి పిలుపు వస్తుందా? మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యల వెనుక…

న్యూఢిల్లీ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశం..ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ భేటీలో చర్చించామని టీపీసీసీ చీఫ్ బీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు భేటీ అయ్యారు. అనంతరం మహేశ్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు.

మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజగోపాల్ రెడ్డి అసమ్మతి అంశంపై ఈ భేటీలో చర్చించామని, త్వరలోనే పార్టీ ఆయనను పిలిచి మాట్లాడుతుందని తెలిపారు. మంత్రులందరితో మా పార్టీ అగ్ర నాయకులు సమావేశం అయ్యారని, తెలంగాణలో అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలపై ఖర్గే, రాహుల్ అభినందించారు అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ప్రజలు సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టే పార్టీని ఆశీర్వదించారు అని ఖర్గే తెలిపారు అన్నారు.

సెంటిమెంటు, మతం ఆధారంగా రాజకీయాలు ప్రతిసారీ చెల్లవు అని, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పరిపాలనను ప్రజలు ఆమోదించినందునే కాంగ్రెస్ కు రాష్ట్రంలో వరుస విజయాలు అందించారు అన్నారు.తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై రెండు రోజుల్లో మరోసారి ఢిల్లీకి వచ్చి చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలిపారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయాలు సాధించబోతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

BRS MLAs Defection Case : తుది అంకానికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ
Telangana Thalli Funds : తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు