• Telugu News
  • /Andhra pradesh

వైరల్..ఎడ్లబండిపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి సాఫ్ట్‌వేర్ వరుడు!

అమలాపురానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆధునిక ఆడంబరాలకు భిన్నంగా ఎడ్లబండిపై పెళ్లి మండపానికి ఊరేగింపుగా చేరుకుని అందరినీ ఆకట్టుకున్నాడు. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇచ్చిన ఈ పెళ్లి వేడుక వీడియో వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Jul 08, 2026, 2:34 pm IST
Read Time: 4 mins
వైరల్..ఎడ్లబండిపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి సాఫ్ట్‌వేర్ వరుడు!

ఆధునిక యువత పెళ్లిళ్లు..నిశ్చితార్థాలు వంటి వేడుకలకు ఆడంబరాలకు పోయి లక్షలు వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. కార్పోరేట్ సంపన్న వర్గాలు సైతం రాజస్థాన్, మాల్ధీవులు, అమెరికా వంటి చోట్ల ప్రత్యేక ఈవెంట్ల ద్వారా పెళ్లి వేడుకలు జరుపుకుంటూ కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. ఈ తరహా అనవసరపు ఆడంబరాలు తగ్గించుకోవడం మంచిదన్న సూచనలు పెరిగిపోతున్నా…పాటించేవారు మాత్రం కరవవుతున్నారు. మధ్యతరగతి వారు సైతం తప్పదన్నట్లుగా శక్తికి మించి పెళ్లి వేడుకలు నిర్వహిస్తూ ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారు.

అయితే అలాంటి ఆడంబరపు పోకడలకు భిన్నంగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సనాతన సాంప్రదాయ పద్దతిలో పెళ్లి వేడుకలో సందడి చేయడం వైరల్ గా మారింది. ఆధునిక యుగంలోనూ మన ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ, సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎండ్ల బండిపై పెళ్లి మండపానికి వచ్చి అందరిని అశ్చర్య పరిచాడు.

అమలాపురంకు చెందిన శుభకర్ తన పెళ్లి మండపానికి ఎడ్లబండిపై ఊరేగుతూ చేరుకున్నాడు. అందంగా ముస్తాబు చేసిన ఎండ్ల బండిపై శుభకర్ కల్యాణ మండపానికి చేరుకోగా..వెనుక బండెనుక బండి కట్టినట్లుగా మరిన్ని ఎండ్ల బండ్లలో బంధుమిత్రులు సైతం అనుసరించారు. శుభకర్ ఎండ్ల బండి ఊరేగింపు సంక్రాంతి పండుగ సందడిని, పూర్వకాలపు జ్ఞాపకాలను తలపిస్తూ వినూత్నంగా ఉందంటూ పెళ్లి వేడుకకు హాజరైన బంధు మిత్రులు అభినందనలతో ముంచెత్తారు.

నేటితరం యువతకు, హైటెక్ పోకడలకు భిన్నంగా పూర్వ పద్ధతుల్లో ఎండ్ల బండిపై ఊరేగుతూ కల్యాణ వేదికకు వచ్చిన వరుడు శుభకర్ ను వధువు శ్రీలేఖ సైతం అభినందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరుచడం విశేషం.