భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతికి వేదిక కాబోతుంది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రకాల దేశీయ గుర్రాల జాతులను రిజిస్టర్డ్ జాతుల జాబితాలో గుర్తించింది. వీటికి అదనంగా తెల్లటి ‘నుక్రా’జాతి గుర్రం భారతదేశపు తొమ్మిదవ రిజిస్టర్డ్ గుర్రపు జాతిగా అవతరించబోతుండటం ఆసక్తికరం.
నుక్రా త్వరలో ఒక ప్రత్యేక దేశీయ జాతిగా అధికారిక గుర్తింపు పొందనుందని రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం(NRCE) వెల్లడించింది. నుక్రా గుర్రంపై మొట్టమొదటి శాస్త్రీయ సర్వే, డాక్యుమెంటేషన్‌ను మొదలైందని, దీనికి ఆమోదం పొందితే, భారతదేశపు తొమ్మిదవ అధికారికంగా గుర్తింపు పొందిన గుర్రపు జాతిగా నుక్రా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
నుక్రాను ఒక ప్రత్యేక గుర్రపు జాతిగా గుర్తించడం జరిగితే ఈ జాతి గుర్రాల అభివృద్ది, సంరక్షణకు తోడ్పడుతుందని, ప్రభుత్వ పరంగాకూడా శాస్త్రీయ పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం అధికారులు వెల్లడించారు. గుర్రాలను పెంచే యజమానులకు నుక్రా జాతి గుర్రాల పెంపకంతో మంచి ధరలు పొందవచ్చని అధికారులు అంటున్నారు.
నుక్రా గుర్రం దాని మెరిసే తెల్లటి చర్మం, గులాబీ రంగు ముక్కు, పెదవులు, దృఢమైన శరీరం, ప్రశాంతమైన స్వభావంతో ప్రత్యేకంగా ఉంటుందని అధికారులు వివరించారు. సుమారు 160 నుండి 170 సెంటీమీటర్ల ఎత్తు ఉండే నుక్రా జాతి గుర్రం, దాని ఓర్పు, చురుకైన నడక, పరుగు ఆకట్టుకునే రూపానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించారు.
అరుదైన గుర్రపు జాతుల నెలవు రాజస్థాన్..
అరుదైన, పురాతన జాతి గుర్రం జాతులకు రాజస్థాన్ నెలవుగా కొనసాగుతుంది. బంగారు రంగు చర్మంతో మెరిసిపోయే మార్వారీ జాతి గుర్రం రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతమైన మార్వారీకి చెందిన ఒక అరుదైన, పురాతన జాతి గుర్రంగా గుర్తింపు పొందింది. దీని చెవులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ఈ అశ్వం చాలా ఓర్పుతో ఉంటుంది. అలాగే స్వారీ చేసేవారి పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. దీంతో మార్వారీ జాతి గుర్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. బంగారు రంగు గుర్రాలు సాధారణంగా తుర్క్‌మెనిస్థాన్‌లో కనిపిస్తాయి. వాటిని పలోమినో అని పిలుస్తారు. వాటి లక్షణాలతో ఉండే మార్వారీ జాతి గుర్రాలు రాజస్థాన్ లో కూడా మనుగడ సాగిస్తున్నాయి.అశాస్త్రీయ పెంపకం పద్ధతుల కారణంగా 1930లలో ఈ జాతి అంతరించిపోయే దశకు చేరుకుంది. అయితే భారతీయ పెంపకందారులు, ప్రభుత్వం చొరవతో చేపట్టిన సమష్టి సంరక్షణ చర్యల వల్ల మార్వారీ జాతి గుర్రాలు సంఖ్య పెరిగింది.
నిన్న మార్వారీ అశ్వాలు…రేపు నుక్రా
మార్వారీ జాతి గుర్రాలు కఠినమైన పరిస్థితులున్న రాజస్థాన్ భూభాగం నుంచి వచ్చినందున అవి చాలా తక్కువ నీటితో జీవించగలవు. తీవ్రమైన ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను తట్టుకోగలవు. అలసిపోకుండా ఎక్కువ దూరం ఎడారిలో ప్రయాణించగలవు. ఈ గుర్రాల నడకను సవారీదారులు ఎంతో విలువైనదిగా భావిస్తారు. వాస్తవానికి మార్వారీ అశ్వాలను యుద్ధ గుర్రాలుగా పరిగణిస్తారు. మార్వారీ గుర్రాలు ధైర్యం, తెలివితేటలు, ఓర్పునకు ప్రసిద్ధి చెందాయి. అలాగే వీటిని పవిత్రమైనవిగా భావించి ఉన్నత హోదాకు, రాజరికానికి ప్రతీకలుగా పరిగణించేవారు.
మార్వారీ జాతి గుర్రాలు గుజరాత్‌లోని కతియావార్ ద్వీపకల్పానికి చెందిన కతియావారీ జాతికి అశ్వాలకు దగ్గరి పోలికలు ఉన్నాయి. కతియావారీ జాతి గుర్రాలకు కూడా చెవులు లోపలికి వంగి ఉంటాయి. ఈ చెవులు అత్యుత్తమ వినికిడి శక్తి కోసం రాడార్‌లా పనిచేస్తాయి. తీవ్రమైన ఎడారి ఇసుక తుపానుల నుంచి కూడా ఈ చెవులతో బయటపడగలవని నమ్ముతారు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా గుడియా గ్రామంలోని మార్వారీ జాతికి చెందిన అరుదైన బంగారు వర్ణపు (గోల్డెన్ కలర్) గుర్రం ఒకటి ఇటీవల భారీ ధరకు అమ్ముడైంది. గోల్డెన్ కింగ్‌గా పేరొందిన ఈ అశ్వం ఏకంగా రూ. 70 లక్షల రికార్డ్ ధరకు సేల్ అవ్వడం గమనార్హం.
మార్వారీ జాతీ గుర్రం కంటే మెరుగైన లక్షణాలతో ఇప్పుడు కొత్తగా రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జాతీయ అశ్వ పరిశోధనా కేంద్రం నుక్రా జాతి గుర్రాలను అభివృద్ది చేసింది. నుక్రా జాతి గుర్రాలకు కేంద్రం నుంచి రిజిస్టర్డ్ గుర్రపు జాతిగా గుర్తింపు దక్కితే..ఈ జాతి గుర్రాల పోషణ, జనాభా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
White ‘Nukra’ could become India’s ninth registered horse breed.
The Nukra may soon receive official recognition as a distinct indigenous breed.
Bikaner based National Research Centre on Equines has launched first-ever scientific survey and documentation of the Nukra horse.
If… pic.twitter.com/tXWOWxZwcE
— News Arena India (@NewsArenaIndia) July 8, 2026