రహదారిపై నాగు పాము..గూగుల్ మ్యాప్ లేకపాయే!

బెంగళూరులో రద్దీ రహదారిపై చిక్కుకున్న నాగుపాముకు ట్రాఫిక్ పోలీసు వాహనాలను నిలిపి సురక్షితంగా దారి కల్పించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 08, 2026, 12:38 pm IST
Read Time: 4 mins
రహదారిపై నాగు పాము..గూగుల్ మ్యాప్ లేకపాయే!

అడవులు, తుప్పలు..పాడుబడిన ప్రాంతాలలో ఎక్కువగా ఉండే పాములు పెరుగుతున్న జనావాసాల కారణంగా తమ ఆవాసాలను కోల్పోతూ నగరాల బాట పడుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూర్ వంటి నగరాలలో తరుచూ నాగుపాములు, ఇతర పాముల సంచారం వెలుగుచూస్తున్న ఘటనలు కోకొల్లలు. అయితే బెంగుళూరులో ఓ నాగుపాము మాత్రం తన చర్యలతో ప్రత్యేకంగా నిలిచింది.

సెంట్రల్ బెంగళూరు నగరంలోని ప్యాలెస్ రోడ్డులో తేలికపాటి వర్షం కురుస్తుండగా రహదారిపై వరుసగా వాహనాలు రయ్ రయ్ మంటూ వెలుతుండగా..రోడ్డు మధ్యలో ఓ నాగుపాము పడగ విప్పి తను ముందెకెళ్లే దారి కోసం తంటాలు పడుతూ కనిపించింది. వాహనదారులు ఆ పామును చూస్తున్నప్పటికి దానిని పట్టించుకోకుండా..అది రోడ్డు దాటే వరకైనా ఆగకుండా తమ దారిన తాము వెళ్లిపోతుండటంతో ఆ పాముకు రోడ్డుపై నుంచి పక్కకు వెళ్లే అవకాశం దొరకని పరిస్థితి ఏర్పడింది.

నాగుపాము అవస్థను గమనించిన ట్రాఫిక్ పోలీస్..వాహనదారులకే కాదు..పాముకు కూడా దారి చూపడం తన ట్రాఫిక్ డ్యూటీ కాబోలు అనుకుని దాని వద్దకు వచ్చాడు. ఓ వైపు పాము సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు సెల్ ఫోన్ లో అందిస్తునే..ఇంకోవైపు అది రోడ్డు దాటేందుకు దారి ఏర్పాటుకు రహదారిపై వెలుతున్న వాహనాలను కొద్దిసేపు ఆపివేశాడు. పాము రోడ్డు దిగి పక్కకు వెళ్లిపోయే వరకు చూసి తిరిగి ట్రాఫిక్ పునరుద్దరించాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ఆ నాగుపాము పొరపాటున నగరంలోకి వచ్చి..తిరిగి తన అవాసానికి వెళ్లే దారి తెలియక అయోమయంతో ట్రాఫిక్ లో నడిరోడ్డుపై చిక్కుకపోయిందని అభిప్రాయపడ్డారు. పాపం మనుషుల్లాగే… ఆ పాముకు గూగుల్ మ్యాప్ సహాయం తెలిసుంటే తన దారిన తాను వెళ్లిపోయేదంటూ హాస్యంగా కామెంట్లు పెడుతున్నారు.