EPS | ఈపీఎస్ కింద కనీస పెన్షన్‌ను పెంచనున్న కేంద్రం

EPS | ఈపీఎస్ కింద కనీస పెన్షన్‌ను పెంచనున్న కేంద్రం

EPS | ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (EPS) కింద పెన్షన్‌ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని తెలుస్తున్నది. ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయం తెలిపారని మనీ కంట్రోల్‌ ఒక కథనంలో పేర్కొన్నది. ప్రస్తుతం ఈపీఎస్‌ కింద నెలకు కనీసంగా వెయ్యి రూపాయలను ఇస్తున్నారు. కొద్ది నెలల్లో ఈ పెన్షన్‌ను మూడు వేలకు పెంచే అవకాశం ఉన్నదని ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. అయితే.. ఈపీఎస్‌ రిటైర్డ్‌ ఉద్యోగులు కనీసం నెలకు 7500 పెన్షన్‌ ఇవ్వాలని కోరుతుండగా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈపీఎస్‌ అనేది ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఉన్నది. సంఘటిత రంగంలో ఉద్యోగులకు వారి రిటైర్మెంట్‌ అనంతరం క్రమంతప్పకుండా ఆదాయం కల్పించేలా పెన్షన్‌ను అందిస్తుంటుంది. ప్రస్తుతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు యజమాని చెల్లించే 12% వాటాలో 8.33% భాగం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు వెళుతున్నది. మిగిలిన 3.67% ఈపీఎఫ్‌కు వెళుతుంది. ‘కనీస పెన్షన్‌ను నెలకు మూడు వేల రూపాయలకు పెంచనున్నాం. ఇది ఇప్పటికే బాగా ఆలస్యమైంది’ అని ఆ అధికారి చెప్పారు. ఈపీఎస్‌ కింద కనీస పెన్షన్‌ను నెలకు 2000 రూపాయలు చెల్లించేందుకు ఒక ప్రతిపాదనను కార్మిక శాఖ చేసింది. దీనికి అదనపు బడ్జెట్‌ను కేటాయించాలని కోరింది. అయితే.. అప్పట్లో దీనిని ఆర్థిక శాఖ ఆమోదించలేదు.

2025 బడ్జెట్‌ ముదస్తు చర్చల్లో భాగంగా ఈపీఎస్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ను కలిసింది. ఈపీఎస్‌ కనీస పెన్షన్‌ను నెలకు 7500కు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఆ సమయంలో వారికి ఎలాంటి హామీ కూడా ఆర్థిక మంత్రి నుంచి లభించలేదు. మొత్తం ఈపీఎస్‌ కార్పస్‌ 8 లక్షల కోట్లుగా ఉన్నది. ఈ స్కీం కింద పెన్షనర్లు 78 లక్షలకు పైగా ఉన్నారు. వారిలో సుమారు 36 లక్షల మంది ప్రస్తుతం ఇస్తున్న నెలకు వెయ్యి కనీస పెన్షన్‌ను అందుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Sleep: ఎంత ట్రై చేసినా నిద్ర పట్టట్లేదా.. ఇలా చేయండి!
Diabetes: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు షుగర్ ఉన్నట్లే
Hot Water: ఈ సమస్యలు.. ఉన్న వారు వేడి నీరు తాగొద్దు!