Hot Water: ఈ సమస్యలు.. ఉన్న వారు వేడి నీరు తాగొద్దు!

Hot Water:
ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగటం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. బరువు తగ్గటానికి, జీర్ణక్రియ సాఫీగా ఉండటానికి ఇది సహాయపడుతుందని అంటారు. అయితే, కొందరికి ఉదయం వేడినీరు తీసుకోవడం అంత మంచిది కాకపోవచ్చు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం వేడినీరు త్రాగితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపులో సమస్యలు:
కడుపులో సమస్యలు ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో వేడినీరు తీసుకోకూడదు. అలా చేస్తే హాని కలగవచ్చు. వేడినీటి వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఉబ్బరం కూడా రావచ్చు. కడుపులో పుండ్లు (అల్సర్లు) ఉన్నవారు వేడినీరు, చల్లని పానీయాలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అల్సర్లతో బాధపడుతున్నవారు కారంగా ఉండే ఆహారాలు, కెఫిన్, ఆల్కహాల్, పుల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.
గుండెల్లో మంట (యాసిడ్ రిఫ్లక్స్):
చాలామంది గుండెల్లో మంట సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు వేడినీరు త్రాగటం మంచిది కాదు. దీనివల్ల కడుపులోని ఆమ్లం ఆహార గొట్టంలోకి చేరుతుంది. దీనితో కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
విరేచనాలు:
విరేచనాలు అవుతున్నప్పుడు వేడినీరు త్రాగటం మంచిది కాదు. ఇది వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, లేదా కొన్ని మందుల ప్రభావం వల్ల సంభవించవచ్చు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ లేదా అల్సరేటివ్ కొలిటిస్ ఉన్నప్పుడు తరచుగా టాయిలెట్‌కు వెళ్లవలసి వస్తుంది. ఈ సమయంలో గోరువెచ్చని నీరు త్రాగితే శరీర జీవక్రియ, ప్రేగు కదలిక పెరుగుతుంది. కాబట్టి, అప్పుడు చల్లని నీరు తీసుకోవడం ఉత్తమం.