EPFO 3.0 Reforms | ప్రావిడెంట్​ ఫండ్​ సేవలు : EPFO 3.0తో ఇక ఎక్కడైనా, ఎప్పుడైనా..!

EPFO 3.0 సంస్కరణలతో కొత్త వెబ్‌సైట్‌, AI భాషా అనువాదం, UPI విత్‌డ్రా, కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ అమలుకానుంది. ఉద్యోగులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు EPFO కీలక అడుగులు వేస్తోంది.

EPFO 3.0 Reforms | ప్రావిడెంట్​ ఫండ్​ సేవలు : EPFO 3.0తో ఇక ఎక్కడైనా, ఎప్పుడైనా..!

EPFO 3.0 Reforms: New Portal, AI Translation, UPI Withdrawals and Core Banking System

  • EPFO 3.0 కింద కొత్త వెబ్‌సైట్‌, కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ అమలు
  • AI ఆధారిత ‘భాషిణి’ ద్వారా స్థానిక భాషల్లో సమాచారం
  • BHIM యాప్ ద్వారా UPI విత్‌డ్రా సౌకర్యం త్వరలో
  • విత్‌డ్రా నిబంధనల సడలింపుతో సులభతరం

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత ఆధునీకరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. EPFO 3.0 పేరిట చేపట్టిన తాజా సంస్కరణల ద్వారా కొత్త వెబ్‌సైట్‌, ఆధునిక సాఫ్ట్‌వేర్‌, AI ఆధారిత భాషా అనువాదం, కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ వంటి సౌకర్యాలను అమలు చేయనుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న సభ్యులు ఏ పిఎఫ్​ కార్యాలయంలోనైనా తమ ఖాతాలకు సంబంధించిన సేవలను పొందే అవకాశం కలుగుతుంది.

బ్యాంకుల తరహాలో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అమలుతో అన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఒకే నెట్‌వర్క్‌లో పనిచేస్తాయి. ఉద్యోగాల కోసం తరచూ ప్రాంతాలు మారే కార్మికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. కొత్త వెబ్​సైట్​ను సభ్యులు సులభంగా వాడేవిధంగా రూపొందించనుండగా, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ‘భాషిణి’ AI ప్లాట్‌ఫామ్‌ ద్వారా స్థానిక భాషల్లో సమాచారం అందించనున్నారు.

కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత అసంఘటిత రంగ కార్మికులకూ భవిష్య నిధి పరిధి విస్తరించనుంది. ప్రస్తుతం EPFOలో సుమారు 8 కోట్ల క్రియాశీల సభ్యులు ఉండగా, దాదాపు రూ.28 లక్షల కోట్ల నిధుల నిల్వలున్నాయి.  20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు భవిష్యనిధి వర్తింపు తప్పనిసరిగా అమలులో ఉంది.

UPI విత్‌డ్రా, విత్‌డ్రా నిబంధనల సడలింపు, అమలు గడువు

EPF withdrawal through ATM and UPI showing successful PF transfer on mobile phone screen

ప్రస్తుతం కొనసాగుతున్న EPFO 2.0 సంస్కరణలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా UPI ఆధారిత ఉపసంహరణ సౌకర్యాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. BHIM యాప్ ద్వారా సభ్యులు తమ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఉపసంహరించుకునే అవకాశం కలుగుతుంది. ప్రారంభ దశలో ఒక్క లావాదేవీకి గరిష్ఠంగా రూ.25 వేల వరకు పరిమితి ఉండే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌, ఉపసంహరణకు అర్హమైన మొత్తం వివరాలు యాప్‌లోనే కనిపించనున్నాయి.

అలాగే విత్‌డ్రా కేటగిరీలను 13 నుంచి 3కి తగ్గిస్తూ నిబంధనలను సడలించారు. ఆరోగ్యం, విద్య, వివాహం వంటి అత్యవసరాలు, గృహనిర్మాణ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాల్లో మాత్రమే ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఉద్యోగం లేని సమయంలో ముందస్తు సెటిల్‌మెంట్‌కు కనీస కాలాన్ని రెండు నెలల నుంచి 12 నెలలకు పెంచారు.

వివరాలు స్వయంగా సవరించుకోవచ్చు

2025 జనవరి నుంచి సభ్యులు తమ పేరు, జన్మతేది, లింగం, జాతీయత, కుటుంబ వివరాలు, ఉద్యోగ తేదీలు వంటి అంశాలను స్వయంగా సవరించుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల డిసెంబర్‌ 2025 వరకు 32.23 లక్షల సవరణలు నమోదయ్యాయి. 2017 అక్టోబర్‌ 1కి ముందు జారీ అయిన UANలకు సంస్థల యజమానులు కూడా వివరాలు సవరించవచ్చు.

EPFO 3.0 అమలుకు సంబంధించి ప్రస్తుతం IT ప్లాట్‌ఫామ్ కోసం టెండర్ ప్రక్రియ చివరి దశలో ఉంది. Wipro, Infosys, TCS సంస్థలను తుదిదశకు ఎంపిక చేసారు. ఆర్థిక పరిశీలన పూర్తైన తర్వాత త్వరలో టెండర్ విడుదల కానుంది. ఈ ఏడాది నుంచే దశలవారీగా EPFO 3.0 అమలు చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. UPI సేవలు ఏప్రిల్ నాటికి ప్రారంభం కావొచ్చని సమాచారం.

ఈ సంస్కరణలతో ప్రావిడెంట్​ ఫండ్​ వ్యవస్థ పూర్తిగా డిజిటల్‌, పారదర్శకంగా మారనుండగా, సభ్యులకు వేగవంతమైన, సులభమైన సేవలు అందే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.