రామ్‌చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ల గారాల‌ప‌ట్టి క్లీంకార జ‌న్మ‌ర‌హ‌స్యం..!

రామ్‌చ‌ర‌ణ్-ఉపాస‌న దంప‌తుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇద్ద‌రూ విడివిడిగా గొప్ప టాలెంట్ ఉన్న‌వారు. స్వంతంగా త‌మ వ్యాసంగాల‌లో ఆరితేరిన‌వారు.

  • Publish Date - May 15, 2024 / 10:00 PM IST

రామ్‌చ‌ర‌ణ్-ఉపాస‌న దంప‌తుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇద్ద‌రూ విడివిడిగా గొప్ప టాలెంట్ ఉన్న‌వారు. స్వంతంగా త‌మ వ్యాసంగాల‌లో ఆరితేరిన‌వారు. రామ్‌చ‌ర‌ణ్ త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవి న‌ట వార‌స‌త్వాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుని, అంత‌ర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న క‌థానాయ‌కుడు. ఇక ఉపాస‌న పుట్ట‌డ‌మే బంగారు చెంచాతో పుట్టింది. కానీ, ఆ వార‌స‌త్వంతో కాకుండా త‌న‌కుతానుగా ఎద‌గాల‌ని చాలా గొప్ప చ‌దువులు చ‌ద‌వ‌డ‌మే కాకుండా అపోలో ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ‌ను, సొంతంగా ఒక లైఫ్‌స్టైల్ ప‌త్రిక‌కుఎడిట‌ర్‌గా, ప‌బ్లిష‌ర్‌గా బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తోంది.

ఒక కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ప‌రిచ‌య‌మైన ఈ ఇద్ద‌రు క్ర‌మంగా స్నేహితులై, ప్రేమికులై త‌ర్వాత 2012 జూన్ 14న దంప‌తుల‌య్యారు. ఈ శుభ‌కార్యం జ‌రిగి ఇప్ప‌టికి 12 సంవ‌త్సరాలైంది. గ‌త సంవ‌త్స‌రం జూన్ 20న వీరు త‌ల్లిదండ్రులు కూడా అయ్యారు. ఒక ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఉపాస‌న‌, త‌మ కూతురికి ‘క్లీంకార’ అని పేరుపెట్టారు.

 ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. పెళ్ల‌యిన 11ఏళ్ల‌కు ఉపాస‌న త‌ల్ల‌యింది. అప్ప‌టివ‌ర‌కు త‌న‌ను దాదాపు అంద‌రూ ఏదో సంద‌ర్భంలో పిల్ల‌లెప్పుడూ? అని అడుగుతూనే ఉన్నారు. అత్త‌గార‌యితే(చిరంజీవి భార్య సురేఖ‌) మ‌రీనూ. ఈ విష‌యం ఉపాస‌న త‌నే స్వ‌యంగా చెప్పింది. స‌ద్గురు జ‌గ్గీవాసుదేవ్‌తో ఇష్టాగోష్టిలో కూడా త‌ను ఈ ప్ర‌స్తావ‌న తెచ్చింది. ఉపాస‌న వెలిబుచ్చిన అభిప్రాయం ఏంటంటే, త‌మ దంప‌తులిరువురం జీవితంలో స్థిర‌ప‌డ్డాక‌, పిల్ల‌ల‌ను కందామ‌ని అనుకున్నామ‌ని, ఆర్థికంగా, సామాజికంగా సౌకర్యంగా ఉన్నామ‌నిపించిన‌పుడే పిల్ల‌ల‌కు జ‌న్మనిద్దామ‌ని త‌మ ఉద్దేశ్య‌మ‌ని చాలాసార్లు తెలిపింది. త‌ను సామాజిక మాధ్య‌మాల‌లో చాలా చురుకుగా ఉంటుంద‌ని అంద‌రికి తెలుసు.

 ‘ఆర్ఆర్ఆర్’ జ‌పాన్‌లో విడుద‌లైన సంద‌ర్భంగా టోక్యో వెళ్లిన ఈ జంట‌, తాము ఇప్పుడు త‌ల్లిదండ్రులు కావ‌డానికి రెడీగా ఉన్నామ‌ని చెప్పింది. ప‌ర్టిక్యుల‌ర్‌గా ఉపాస‌న చెప్పింది. ఇది జ‌రిగింది అక్టోబ‌ర్ 2022లో. స‌డెన్‌గా డిసెంబ‌ర్ 2022లో ఉపాస‌న గ‌ర్భందాల్చింద‌ని కొణిదెల కుటుంబం ప్ర‌క‌టించింది. త‌న ఫ్యామిలీలోకి బుల్లి స‌భ్యుడు/స‌భ్యురాలు రాబోతోంద‌ని మెగాస్టార్ ఆనందంతో త‌బ్బిబ్బ‌వుతూ పోస్ట్ పెట్టాడు. త‌ర్వాత జ‌రిగింది అంద‌రికీ తెలుసు.

ఇక్క‌డే ఉపాస‌న‌ను క్లోజ్‌గా అనుస‌రించే కొంత‌మందిలో అనుమానం మొల‌కెత్తింది. త‌ను గొప్ప వైద్య విజ్ఞాన సంస్థ‌కు అధిప‌తి. ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్య‌త‌నిచ్చే అమ్మాయి. ఎన్నో దేశ‌విదేశాల్లోని ఆసుప‌త్రులు, ఆరోగ్య‌ప‌రిశోధ‌నా సంస్థ‌లు బాగా ప‌రిచ‌యం. స్టెమ్‌సెల్ బ్యాంక్ గురించి, దాని విశిష్ట‌త గురించి ఉపాస‌న చాలాసార్లు వివిధ సంద‌ర్భాల్లో వివ‌రించారు. ఉపాస‌న గ‌ర్భం ‘స‌హ‌జ‌మైంది’ కాద‌ని వారి అనుమానం. ఆ అనుమాన‌మే నేడు నిజ‌మైంది. ఈ మ‌ధ్య కొంత‌మంది మ‌హిళ‌ల‌తో ఇష్టాగోష్టిగా స‌మావేశ‌మైన ఉపాస‌న, మ‌హిళ‌లు త‌మ‌న అండాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చడం, ఆ త‌రువాత ఎప్పుడు(కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత‌) కావాల‌నుకుంటే అప్పుడు, త‌మ భ‌ర్త‌ల శుక్ర‌క‌ణాల‌తో ఫ‌ల‌దీక‌రణం చేయించి, త‌మ గ‌ర్భాల్లో ప్రవేశ‌పెట్టుకోవ‌డం ద్వారా గ‌ర్భం దాల్చ‌వ‌చ్చ‌ని, తానూ అలాగే చేసాన‌ని స్ప‌ష్టం చేసింది. అంటే ఒక‌రకంగా స‌రోగ‌సీ అన్న‌ట్టే కానీ, అద్దె గ‌ర్భం మాత్రం కాదు. అంటే ఎప్పుడో ప‌దేళ్ల క్రితం భ‌ద్ర‌ప‌రిచిన త‌న అండాల‌తో ఇప్పుడు తాను క్లీంకార‌కు జ‌న్మ‌నిచ్చాన‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది.

 అయితే, నిజానికి ఈ విష‌యంలో ఎవ‌రినీ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అది పూర్తిగా వారి వారి వ్య‌క్తిగ‌త ఇష్టానుసారం అనుస‌రించిన విధానం. ఈ ప‌ద్ధ‌తికి త‌న భ‌ర్త రామ్‌చ‌ర‌ణ్ మ‌ద్ద‌తు తెలిపిఉంటాడు కాబ‌ట్టి, ఏ స‌మ‌స్యా లేదు. మిగిలిన కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా అభ్యంత‌రం ఉన్న‌ట్లుగా మ‌న‌కు తెలిసే అవ‌కాశ‌మూ లేదు. స్వ‌త‌హాగానే ఉపాస‌న డైన‌మిక్ లేడీ. రామ్‌చ‌ర‌ణ్ వ్య‌క్తిగ‌తంగా అంత దూకుడుగా ఉండ‌డ‌ని చెబుతారు. కాబ‌ట్టి ఈ ప‌ద్ధ‌తి వారికి వ‌ర్క‌వుట్ అయింది. ఇది పూర్తిగా వారి కుటుంబ వ్య‌వ‌హారం. కానీ, నైతికంగా, వైవాహిక జీవన సంప్ర‌దాయానికి వ్య‌తిరేకంగా “అస‌హ‌జంగా” జ‌రిగిన సృష్టి ప్ర‌క్రియ ఇది.

 భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య శారీర‌క సంబంధం లేకుండా, కేవ‌లం భౌతిక అవ‌స‌రాల‌పై(?) మాత్ర‌మే దృష్టిపెట్టి చేసిన ఈ ప‌ని చ‌ట్ట‌విరుద్ధం కాక‌పోవ‌చ్చు కానీ, వివాహం అనే ప‌ద్ధ‌తిని అగౌర‌వ‌ప‌రిచిన‌ట్టేన‌ని కొంద‌రి అభిప్రాయం. వాస్త‌వానికి ఉపాస‌న చెప్పిన కార‌ణం(జీవితంలో స్థిర‌ప‌డ్డాక‌) వారికి అస‌లే వ‌ర్తించ‌దు. వేలాది కోటీశ్వ‌రులు వారు. స‌రే…పేద‌వారు, ఇంట్లో ఇంకో జీవిని భ‌రించే శ‌క్తిలేని వారైతే ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తే త‌ప్పేమీకాక‌పోవ‌చ్చు. కానీ, వారు ఈ ప‌ద్ధ‌తిన గ‌ర్భం ధరించ‌డానికి చాలా ఖ‌ర్చ‌వుతుంది. అది వాళ్లవ‌ల్లకాదు. అంటే, మ‌ళ్లీ ఇది అమ‌లు చేయాలంటే ధ‌న‌వంతులే అయ్యుండాలి.

 ఈ ప‌ద్ధ‌తి వ‌ల్ల‌, “పెళ్లి వ‌ద్దు, పిల్ల‌లు మాత్రం కావాల‌”నుకునే యువతీయువ‌కుల‌కు కూడా త‌ల్లీ, తండ్రీ అయ్యే అవ‌కాశం ల‌భిస్తుంది. (ఈమ‌ధ్య వ‌చ్చిన తెలుగు సినిమా ‘మిస్ శెట్టి-మిస్ట‌ర్ పొలిశెట్టి’ ఈ కాన్సెప్ట్‌తో వ‌చ్చిందే). అంటే సింగిల్ పేరెంట్స్ అన్న‌మాట‌. ఆ పిల్ల‌ల‌కు త‌ల్లి ఉంటే తండ్రి ఉండ‌డు. తండ్రి ఉంటే త‌ల్లి ఉండ‌దు. ఎలాంటి ప‌రిస్థితుల్లో వారు పెరుగుతారు? భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య శారీర‌క సంబంధం వ‌ల్ల కేవ‌లం పిల్ల‌లు పుట్ట‌డ‌మే కాదు, వారిద్ద‌రి మ‌ధ్య ఒక న‌మ్మ‌కం, భావోద్వేగ బంధం, త‌మ మ‌ధ్య ర‌హ‌స్యాలేవీ లేవ‌నే భ‌రోసా ఏర్ప‌డ‌తాయి. ఆ పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను పంచుకుని పెరుగుతారు. అది ఒక మంచి కుటుంబ నిర్మాణానికి దారితీస్తుంది.

 

స‌రోగ‌సీ అనే ప‌ద్ధ‌తిపై చ‌ట్ట‌ప్ర‌కారం కొన్ని నిబంధ‌న‌లున్నాయి. భార్యాభ‌ర్త‌ల్లో ఎవ‌రైనా పిల్ల‌లు క‌న‌డానికి శారీర‌కంగా స‌మ‌ర్థులు కాక‌పోతేనే ఈ ప‌ద్ధ‌తిని అవ‌లంబించాలి. దానికి త‌గిన ప‌త్రాలు స‌మ‌ర్పించి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి కూడా పొందాల్సిఉంటుంది. ఇటువంటి వివాదాస్ప‌ద‌మైన సంఘ‌ట‌న త‌మిళ న‌టి న‌య‌న‌తార‌, విఘ్నేశ్‌శివ‌న్ దంప‌తుల విష‌యంలో కూడా జ‌రిగింది. ఇక్క‌డ న‌య‌న‌తార పూర్తి శారీర‌క సామ‌ర్థ్యం ఉండి కూడా ఫేక్ స‌ర్టిఫికెట్ల‌తో స‌రోగ‌సీని ఎంపిక చేసుకుంది. కేవ‌లం ఈ గ‌ర్భం మోయ‌డాలు, లేబ‌ర్ పెయిన్స్ ఎవ‌డు ప‌డ‌తాడులే అనే భయం వ‌ల్ల‌. కానీ, సృష్టిలో అపురూప‌మైన వ‌రం, అదీ కేవ‌లం స్త్రీకి మాత్ర‌మే సొంత‌మైన అనుభూతి మాతృత్వం. దీన్నే వ‌ద్ద‌నుకునే వారున్నారంటే అది వారి దుర‌దృష్టం.

Latest News