Game Changer | రామ్​చరణ్​ కెరీర్​ను శంకర్​ బలిపెట్టాడా..?

ఆర్​సీ 15​(RC15) – దిగ్గజ తమిళ దర్శకుడు శంకర్​(Shankar Shanmugam) దర్శకత్వంలో రామ్​చరణ్​(Ramcharan) హీరోగా, కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్​గా, ఫిబ్రవరి 2021లో ప్రకటించబడిన సినిమా. షూటింగ్​ ప్రారంభమైంది అదే ఏడాది అక్టోబర్​లో. అంటే ఇంకో నాలుగు నెలలైతే మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సినిమా మాత్రం ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు.

  • Publish Date - June 28, 2024 / 05:22 PM IST

రామ్​చరణ్​.. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నటనలో అద్భుతంగా రాణిస్తూ, అంచెలంచెలుగా శిఖరాగ్రానికి చేరుకున్నాడు. చిరుత(Chirutha)తో మొదలై, ఆర్ఆర్​ఆర్(RRR) దాకా, తన సినీ ప్రస్థానం అబ్బురంగా ఉంటుంది. ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నటుడాయన. నిజానికి దానికంటే ముందు వచ్చిన రంగస్థలం(RangaSthalam), రామ్​చరణంటే ఏంటో జనానికి తెలిసేలా చేసింది. జాతీయ అవార్డు ఒకే పాయింట్​తో మిస్సయిన సినిమా అది. తండ్రి తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్​ అయినా, చరణ్​ నిలబడటానికి అది కారణం కాబోదు. విషయం లేకపోతే, ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవరు. రామ్​చరణ్​ అయినా, అల్లు అర్జున్​ అయినా తమ కష్టంతో, తమ ప్రతిభతో పైకి వచ్చినవారే. కాకపోతే రంగ ప్రవేశం సులభంగా అయింది. అంతే.

రంగస్థలం, ఆర్​ఆర్​ఆర్​ తర్వాత రామ్​చరణ్​ సినిమాల మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ సమయంలోనే ప్రముఖ నిర్మాత దిల్​ రాజు(DIL Raju) సంచలన కాంబినేషన్​కు తెర తీసాడు. దేశంలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన శంకర్​ డైరక్షన్​లో, రామ్​చరణ్​ కథానాయకుడిగా ఆర్​సీ15 ప్రకటించాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలామంది పేరుగాంచిన నటీనటులతో, ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభ టీజర్​కే 5 కోట్లు ఖర్చు పెట్టారని వినికడి. శంకర్​ సినిమాలంటేనే భారీ బడ్జెట్​.

ఈ సినిమాకు కూడా దాదాపు 300 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం సగర్వంగా తెలిపింది. షూటింగ్​ మొదలైంది. ఓ రెండు నెలల పాటు నిర్విరామంగా సాగింది. మధ్యలో ఒకసారి సినిమా టైటిల్​గా గేమ్​చేంజర్​(Game Changer)ను ప్రకటించారు. ఆ తర్వాత పడింది పెద్ద బ్రేకు. శంకర్​, లైకా ప్రొడక్షన్స్​(Lyca Productions) నిర్మాణంలో కమలహాసన్(Kamal Haasan)​ హీరోగా భారతీయుడు 2(Indian-2) అప్పటికే కమిటయిఉన్నాడు. తమ సినిమా పూర్తి చేయకుండా శంకర్​ తెలుగు సినిమాలో ప్రవేశించడంపై లైకా ప్రొడక్షన్స్​ కోర్టుకెక్కింది. దాంతో శంకర్​ చేసేదేమీ లేక, దీన్ని పక్కనబెట్టి, భారతీయుడు 2 లో నిమగ్నమయిపోయాడు. ఇక్కడే పడింది అసలు దెబ్బ.

గేమ్ చేంజర్ పూర్తిగా పక్కకెళ్లిపోయింది. రామ్చరణ్ దీన్ని పూర్తి చేయకుండా ఇంకో సినిమా ప్రారంభించే వీలు లేకుండా పోయింది. తన తర్వాత ప్రాజెక్టులుగా, బుచ్చిబాబు సనా (Buchchibabu Sana) దర్శకత్వంలో ఒకటి, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఒకటి ఒప్పుకుని ఉన్నాడు. బుచ్చిబాబు సినిమాను లాంఛనంగా ప్రారంభించినప్పటికీ, అసలు షూటింగ్ ఇంకా మొదలవలేదు. దానికి రామ్చరణ్ పూర్తిగా మేకోవర్ కావాల్సిఉంది. గేమ్ చేంజర్ గెటప్లు వేరే. దీంతో అటు వేరే సినిమా చేయలేక, శంకర్ పుణ్యమా అని ఈ సినిమా పూర్తి కాక, మధ్యలో నలిగిపోతున్నాడు. సందట్లో సడేమియాలాగా, శంకర్ భారతీయుడు3(Indian 3)ని కూడా గుట్టుచప్పుడు కాకుండా మొదలుపెట్టాడట. ఇక్కడ దారుణంగా నష్టపోతున్నది రామ్చరణ్ ఒక్కడే.

కెరీర్ ఉన్నతస్థాయిలో ఉన్న నటుడు ఒక సినిమా కోసం మూడేళ్లు వృథా చేయాల్సిరావడమనేది కత్తి మీద సాము లాంటిది. తన కెరీర్నే పణంగా పెట్టి ఆడుతున్న గేమ్ ఇది. శంకర్ ఈ విధంగా ప్రవర్తించడం(Shankar’s Betrayal) చాలా దారుణం. తన స్వార్థం కోసం ఒక యువహీరో కెరీర్తో ఆడుకోవడం క్షమించరాని తప్పు. నిజానికి ఈ సినిమా ప్రకటించినప్పుడు చాలామంది ఆనందించారు. ఎంతోమంది హీరోలు కలలు కనే దర్శకుడి నేతృత్వంలో నటించడమనేది అదృష్టంగా భావిస్తారు. మెగాస్టార్​(Chiranjeevi) కూడా ఇదే విషయాన్ని ఆరోజు స్పష్టంగా చెప్పాడు. శంకర్ డైరెక్షన్లో సినిమా చేయాలని తనకు చాలా కోరిక ఉండేదనీ, తనకు తీరకపోయిన తన కుమారుడికి ఆ అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి ఆనందం వ్యక్తం చేసాడు. ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవకుండాపోయింది.

రామ్చరణ్ ఇప్పుడు త్రిశంకుస్వర్గంలో నిలబడ్డాడు. మూడు సంవత్సరాలు ఒకే సినిమా అడపాదడపా షూటింగ్ జరుపుకోవడం, ఎప్పటికప్పుడు ఇక అయిపోయిందని ప్రకటనలివ్వడం మామూలైపోయింది. ఇప్పుడు కూడా ఇంకో పదిరోజులైతే షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. 20 రోజుల క్రితం కూడా ఇదే మాట చెప్పారు. ఈ ఏడాది దసరాకు రిలీజ్ అని ప్రకటిస్తున్నారు కానీ, అది కూడా డౌటే. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన నటుడి కెరీర్లో అత్యంత విలువైన మూడేళ్లు ఒక దర్శకుడి నిర్లక్ష్యం మూలానా నాశనం కావడం ఘోరమైన పరిణామం. ఇందులో దర్శకుడికేం నష్టం లేదు. అతను హ్యాపీగా ఇంకో సినిమా చేసుకుంటున్నాడు. నటీనటులకేం నష్టం లేదు. వారూ వేరే సినిమాలు చేసుకుంటున్నారు. 

నిర్మాత దిల్ రాజు మరి ఎందుకు ఓపిక పడుతున్నాడో మనకు తెలియదు కానీ, దీని వల్ల ఆర్థికంగా కూడా ఎంతో నష్టం(Financial loss) వాటిల్లుతుంది. కెరీర్ ఇదే సమయంలో ఉన్నప్పుడు చిరంజీవి ఏడాదికి 10 సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. సూపర్స్టార్ కృష్ణ ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించాడు. ఇలా మూడేళ్లకొక సినిమా చేస్తే వీరి జీవితకాలంలో ఎన్ని సినిమాలు చేయగలరు? ఇప్పుడు ప్రభాస్​(Prabhas) పరిస్థితి కూడా ఇంతే. రెండు మూడేళ్లు ఒక సినిమా మీద పెట్టి, అది కాస్తా ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పడంటే కల్కి2898(Kalki 2898 AD)  హిట్ అయింది కాబట్టి నడుస్తోంది. కానీ, అంతకుముందు సాహో, రాధేశ్యామ్, సలార్ లాంటి సినిమాలు ఘోరంగా దెబ్బతిన్నప్పుడు ఎంత నష్టం?

నిజానికి సినిమా మేకింగ్ ఇప్పుడు చాలా ఈజీ. అంతా డిజిటల్ యుగం. ఒకప్పుడు అంతా ఫిల్మే. సింగిల్ టేక్లో ఓకే కాకపోతే దర్శకుడి బీపీ పెరిగిపోయేది. ఫిల్మ్ డెవెలప్ అయ్యదాకా ఎలా వచ్చిందో తెలియదు. అప్పట్లో ఫిలిమ్ చాలా ఖరీదు. నిర్మాత కళ్లన్నీ ఫిల్మ్ రీళ్లమీదే ఉండేవి. ఆ తర్వాత ప్రింట్లు వేయడం. పెద్ద హీరో అయితే వందల ప్రింట్లు వేసి, బస్సుల్లో, రైళ్లలో పంపేవారు. ఇప్పడదేమీ లేదు. జస్ట్ సెల్ఫోన్తో కూడా సినిమా తీసేస్తున్నారు. అప్పటికప్పుడు రషెస్ చూసుకుంటున్నారు. నచ్చకపోతే వెంటనే మళ్లీ టేక్. ప్రింట్లు కూడా లేవు. డిజిటల్ రిలీజ్. విడుదల రోజున థియేటర్ ప్రొజెక్టర్లోకి సినిమా నేరుగా డౌన్లోడ్ అయిపోతుంది. మరి ఇన్ని వెసులుబాట్లు ఉన్నాక, టైమ్ వేస్ట్ చేయడమంటే నిర్మాతకు మరణశిక్ష విధించినట్లే. హీరోకు టిపికల్ గెటప్ ఉంటే అతనూ నాశనమయినట్లే.

ఆర్ఆర్ఆర్ (RRR) విడుదలై 2 ఏండ్ల మూడు నెలలైంది. రెండేళ్ల పాటు ఒక పెద్ద హీరో సినిమా లేకపోతే అతని కెరీర్కు ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ గేమ్ చేంజర్ రామ్చరణ్ పాలిటి లైఫ్ చేంజర్గా మారే ప్రమాదముంది. 

ఇప్పటికే ఇంత సమయం పట్టేటప్పటికి ఎన్నో లీకులు, క్లిప్పులు, కథా విశేషాలు అన్నీ అంగ్లటోకి వచ్చేసాయి(Game Changer Story and Clips leaked). ఇప్పుడు సినిమా మీద ఎవరికీ పెద్ద ఆసక్తి కూడా లేదు. విడుదలై విజయవంతమవుతుందన్న ఆశలూ లేవు. మరో సినిమా మొదలుపెట్టి ఎంత తొందరగా కంప్లీట్ చేసినా, ఇంకో ఏడాది పడుతుంది.

ఇదంతా ఎవరి పాపం? (Who is the culprit?) గేమ్ చేంజర్ ఇలా కావడానికి కారణమెవ్వరు? శంకర్ ఇంత దారుణంగా ప్రవర్తించడానికి కారణమేంటి? దిల్ రాజు ఈ ప్రశ్నలెందుకు లేవనెత్తడం లేదు? అభిమానులు మొత్తుకుంటున్నా ఒక్క అప్డేట్ కూడా ఎందుకు రావడంలేదు? రహమాన్, అనిరుధ్ లాంటి మంచి సంగీత దర్శకులను వదిలేసి తమన్ లాంటి చెత్త మ్యూజిక్ డైరెక్టర్ను ఎవరు ఎన్నుకున్నారు.? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే. రామ్చరణ్ సినీ ప్రయాణానికి ఎదురైన గట్టి అవాంతరాలే. వీటికి కాలమే సమాధానం చెప్పాలి.

 

Latest News