Samantha Opens Up About Separation, Illness And Trolling At NDTV World Summit
(విధాత వినోదం డెస్క్)
న్యూఢిల్లీ:
నటి సమంత రూత్ ప్రభు తన జీవితంలోని బాధలు, తప్పులు, నేర్చుకున్న పాఠాలను ఎంతో నిజాయితీగా పంచుకుంది. ఎన్‌డీటీవీ వరల్డ్ సమిట్ 2025లో “Authenticity: The New Fame” అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె — “నిజాయితీ అనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. నేను పరిపూర్ణురాలిని కాదు, తప్పులు చేస్తాను, కానీ ప్రతిరోజూ మెరుగవ్వడానికి ప్రయత్నిస్తాను,” అని తెలిపింది.
తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, విడాకులు, అనారోగ్యం అన్నీ ప్రజల్లోనే జరిగాయని ఆమె చెప్పింది. “నా విడాకులు, నా అనారోగ్యం — ఇవన్నీ అందరికీ తెలిసిపోయాయి. దాంతో పాటు విమర్శలు, ట్రోలింగ్ కూడా ఎదురయ్యాయి. కానీ నేను వాటినుంచి దాక్కోలేదు. ఓపెన్‌గా ఉండడం వల్ల కొంతమంది నన్ను జడ్జ్ చేసారు, కానీ అదే నాకు బలం ఇచ్చింది,” అని సమంత చెప్పింది.
ఈ సోషల్‌మీడియా కాలంలో విజయం, సంతోషాలకు అర్థాలు మారిపోయాయని ఆమె అభిప్రాయపడింది. “ఇప్పుడు ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల జీవనశైలిని అందరూ చూడగలుగుతున్నారు. అది చాలా మందిలో అసంతృప్తి పెంచుతుంది. కానీ అప్పుడే మనం బాధ్యతాయుతంగా ఉండాలి,” అని సమంత తెలిపింది.
ఆమె దృష్టిలో లక్ష్యం అంటే కేవలం ఖ్యాతి కాదు, దానికి ఉద్దేశం ఉండాలి. “నేను అంబిషియసే, కానీ ఆ లక్ష్యానికి ఒక ఉద్దేశం ఉండాలి. గురువులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. వారు మన జీవిత దిశను మార్చగలరు,” అని ఆమె చెప్పింది. తన మొదటి రోజులను గుర్తుచేసుకుంటూ — “నేను సాధారణ కుటుంబంలో పుట్టాను. జీవితం కష్టంగా ఉండేది. ఒక్కసారిగా పేరు, డబ్బు, ఖ్యాతి వచ్చాయి. కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. నిజాయితీ అనేది మన పెంపకం మీద ఆధారపడుతుంది. దానికి దూరమైతే మనలో అస్థిరత వస్తుంది,” అని చెప్పింది.
‘పుష్పా’ సినిమాలోని “ఊ అంటావా..” పాట గురించి సమంత ఇలా చెప్పింది — “నన్ను నేను ఎప్పుడూ ‘సెక్సీ’గా భావించలేదు. ఎవ్వరూ నాకు బోల్డ్ పాత్రలు ఇవ్వలేదు. కాబట్టి నన్ను నేను పరీక్షించుకోవాలనుకున్నా. అందుకే ‘ఊ అంటావా..’ చేశాను. నేను చేయగలనని నాకే నిరూపించుకోవాలనుకున్నా,” అని తెలిపింది. విజయాలు వచ్చిన తర్వాత తాను అనుభవించిన గందరగోళం గురించి మాట్లాడుతూ — “పేరు, డబ్బు, కీర్తి అన్నీ వచ్చినా, ఆ తృప్తి రాలేదు. కానీ ఆ గుర్తింపుతో ఒక విలువ సృష్టించగలిగినప్పుడు నిజంగా సంతోషపడ్డాను. మనకు ఉన్న వేదికను ఉపయోగించి మంచి చేయగలిగితే అదే నిజమైన విజయం,” అని సమంత చెప్పింది.
ఇప్పుడు తన జీవితంలో ముఖ్యమైనది ధ్యానం అని ఆమె తెలిపింది. “ధ్యానం నా జీవితంలో తప్పనిసరి అయింది. అదే నన్ను స్థిరంగా ఉంచుతుంది,” అని సమంత ముగించింది.