- రాజధాని షెడ్యూల్ ప్రారంభానికి సిద్ధం
- మార్చి 27, 2026న భారీ విడుదల
దేశ రాజధానిలో ‘పెద్ది’ సినిమా తర్వాతి షెడ్యూల్‌కి రంగం సిద్ధమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పరచింది. రామ్‌చరణ్ చేసిన క్రికెట్ షాట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రెండు చేతులతో బ్యాట్‌ను గుద్ది, నేలపై బలంగా కొట్టి, బంతిని ఝుమ్మన్నలా పంపిన చరణ్ షాట్.. గ్లోబల్ క్రికెటర్లను ఆకట్టుకుంది. నెట్‌లో రీల్స్, చరిత్రలో ఇన్‌స్టా ట్రెండ్‌గా మారిన ఈ గ్లింప్స్ దెబ్బకు సినిమాపై క్రేజ్ రెట్టింపైంది.
ఇప్పటికే చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. జూలై 12 నుండి ఢిల్లీలో కీలక సన్నివేశాల షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, జాన్వీకపూర్‌లపై రొమాంటిక్ సీన్స్‌తోపాటు పాటల చిత్రీకరణ జరుగనుంది. షూటింగ్‌కు ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఆగస్టులో టాక్‌షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు కెమెరా పనిచేయగా, సంగీతం మాంత్రికుడు ఏ.ఆర్.రహమాన్ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, వెంకటసతీష్ కిలారు నిర్మాతగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రం 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.