University Paper Leak Movie | 22న ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’ విడుదల

‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’ సినిమా ఆగస్టు 22న రిలీజ్! నారాయణమూర్తి దర్శకత్వం, బ్రహ్మానందం ముఖ్యఅతిథి.

university-paper-leak-release-22-aug

University Paper Leak Movie | విధాత : ఆర్‌.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’ ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించింది. బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మన దేశ విద్యావ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని..ఆ మార్పులు ఎలా ఉన్నాయన్న అంశంపై నారాయణమూర్తి రూపొందించిన గొప్ప చిత్రమే ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’అని తెలిపారు. ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’సినిమాలో నిజాలుంటాయి.. బూతులు ఉండవని.. జీవితపు లోతులుంటాయని తెలిపారు. ‘పెద్ద వాళ్లకు కావాలంటే నాలో అమ్మడానికి చాలా ఉన్నాయి.. కిడ్నీ కూడా ఉంది’ అంటూ సాగే కొన్ని డైలాగులు వింటే హృదయం కదిలిపోయిందని బ్రహ్మానందం సినిమాలోని సన్నివేశాలను వివరించారు. ఈ సినిమాను అందరూ చూడాలి. అర్థం చేసుకోవాలని…ఈ దేశాన్ని మళ్లీ బడిలో వేయాలి అని బ్రహ్మానందం చెప్పారు. నారాయణ మూర్తి తేనెటీగ లాంటి మనిషి. అన్ని ప్రాంతాలకు తిరుగుతూ తేనె తీసుకొచ్చి అందరికీ పంచాలనే సంకల్పం ఉన్న మంచి మనిషి. అందమైన హీరో ఎవరని నన్ను అడిగితే నారాయణమూర్తి పేరు చెబుతాను. అందం అంటే గ్లామర్‌ కాదు.. మంచి మనసు. నాకు ఆయన 40 సంవత్సరాలుగా తెలుసు. నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారు. ఈ సినిమా కూడా పేద ప్రజల కోసమే తీశారని బ్రహ్మానందం కొనియాడారు.

40ఏళ్లు నుంచి ఒకే జీవన శైలీ

సమాజం బరువు మోసే వ్యక్తి నారాయణమూర్తి అని..ఆయన ఒక శక్తి’అని నారాయణమూర్తి జీవితం త్యాగాలతో కూడుకున్నదని బ్రహ్మానందం గుర్తు చేశారు. ఆయన జీవితం మీకే అంకితం అని..చివరిశ్వాస వరకూ మీకోసం కష్టపడుతూనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. నారాయణమూర్తి చేసినన్ని మంచి పనులు నేను చేయలేదు.. చేస్తానో, లేదో కూడా తెలియదన్నారు. నాకు తెలిసినప్పటినుంచి ఆయన ఒకేలా ఉన్నారని..అవే చెప్పులు.. అదే ప్యాంటుషర్ట్‌.. అదే ఆటో.. ఒక్క సినిమా హిట్‌ అయితే ఈ రోజుల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అందరికీ తెలుసు. 40 సంవత్సరాల కెరీర్‌లో ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు పెట్టినా వాటికి తలొంచని నిబద్దత నారాయణమూర్తి సొంతమన్నారు. నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఇష్టం.. నారాయణమూర్తి అంటే ఇష్టం అని అన్నారు.

నారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం మహానటుడు, మహా జ్ఞాని. అన్నిటికీ మించి మాస్టారు. అందుకే ఈ సినిమాను ఆయనకు చూపించానన్నారు. ఆయన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’ సినిమా చూశారు. నన్ను ఆశీర్వదించారని తెలిపారు.