Site icon vidhaatha

Vishwambhara | విశ్వంభర – పద్నాలుగు లోకాల ప్రయాణం

Vishwambhara | విశ్వంభర – మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది. ఫాంటసీ, దైవిక, యాక్షన్ అంశాలతో కూడిన ఈ సోషియో ఫాంటసీ సినిమా టాలీవుడ్‌లోనే కాక, భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది. ‘బింబిసార’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న మల్లిడి వశిష్ఠ, ఈ సినిమాను తన కలల ప్రాజెక్టుగా భావించి రూపొందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గాను దేశ విదేశాల నుంచి అగ్రశ్రేణి వీఎఫ్ఎక్స్, సీజీ నిపుణులు పని చేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ ముగిసిందని దర్శకుడు వశిష్ఠ తెలిపారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సౌండ్, డబ్బింగ్ వంటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయనీ, విశ్వంభరలో ఏకంగా 4676 గ్రాఫిక్స్​(VFX Shots)  షాట్లు ఉన్నాయని వశిష్ఠ వెల్లడించారు. ఇది ఇప్పటివరకు తెలుగులో ఏ చిత్రానికీ లేని విశేషం. ప్రపంచ స్థాయికి సరితూగే విధంగా సాంకేతిక బృందాలు ఈ చిత్రానికి పని చేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఒకే వేదికపై పనిచేయడం విశ్వంభర ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఒకరకంగా ఈ చిత్రాన్ని తెలుగు అవతార్(Telugu AVATAR) ​గా చెప్పవచ్చు.

కాగా, చిత్రీకరణ బాకీ ఉన్న పాటను త్వరలో షూట్​ చేయబోతున్నట్లు తెలిసింది. దీన్లో మెగాస్టార్​ సరసన బాలీవుడ్​ భామ మౌనీరాయ్(Mouni Roy)​ స్టెప్పులేయబోతోందని సమాచారం.

ఈ సినిమా కోసం చిత్ర బృందం 16 సెట్స్‌(16 sets)ను రూపొందించింది. ఈ సెట్స్ కథకు అనుగుణంగా ఉండేలా, ప్రకృతి శక్తులైన పంచభూతాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. దృశ్యపరంగానే కాకుండా, ఈ సెట్స్‌ కథలో భాగంగా పనిచేస్తాయని వశిష్ఠ తెలిపారు. ‘‘ఈ సినిమా ప్రపంచం ప్రేక్షకుడిని పూర్తిగా ముంచెత్తేలా ఉంటుంది. ఇది కేవలం ఫాంటసీ కాదు, మానవ భావోద్వేగాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. వీఎఫ్ఎక్స్ సహాయంతో కథను మరింత బలంగా చెప్పగలుగుతున్నాం. అందుకే ఇందులో ఎక్కడా రాజీపడట్లేదు,’’ అని ఆయన వివరించారు.

విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే ఆషికా రంగనాథన్‌, సురభి, ఇషా చావ్లా, కునాల్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు చేసిన వీఎఫ్ఎక్స్ సన్నివేశాలను చూసి చిరంజీవి(Chiranjeevi) ఆశ్చర్యపోయారని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ సన్నివేశాల విజువల్ క్వాలిటీ మెగాస్టార్‌కు కూడా ఆనందాన్ని కలిగించిందని సమాచారం. సినిమా అవుట్‌పుట్ పట్ల యూనిట్ అంతా అత్యంత సంతృప్తిగా ఉందని అంటున్నారు.

దర్శకుడు వశిష్ఠ తాను ఊహించిన దృశ్యాలను వెండితెరపై ప్రతిబింబించేందుకు నిర్మాతలతో కలిసి ఏమాత్రం రాజీపడకుండా ముందుకు వెళ్తున్నారు. యూవీ క్రియేషన్స్(UV Creations) తరఫున విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు కూడా నిర్మాణంలో అధిక నాణ్యతకు ప్రాముఖ్యత ఇస్తూ భారీ బడ్జెట్‌ను వెచ్చిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యాక, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు వారు తెలిపారు.

విశ్వంభర సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పురాణాలు, విజువల్స్, సాంకేతిక నైపుణ్యం, భారీ తారాగణంతో షడ్రసోపేతమైన విందుగా ఉంటుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేసారు.  ఈ సినిమా, 2025లో తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రయత్నంగా పరిశ్రమలో భావిస్తున్నారు.

 

 

Exit mobile version