Crime News | న్యూఢిల్లీ : గుజరాత్ లో కిడ్నాప్ చేసిన ఓ ఆరేళ్ల చిన్నారిని దుండగులు మహారాష్ట్ర నాసిక్ లో హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ముంబైలోని లోకమాన్య తిలక్ రైల్వే టెర్మినల్ లో ఆగిఉన్న రైలులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషినగర్ ఎక్స్ ప్రెస్ (22537) థర్డ్ ఏసీ కోచ్ (బీ2) టాయిలెట్ లో ఉన్న చెత్తబుట్టలో ఆరేళ్ల చిన్నారి డెడ్ బాడీ కనిపించింది. శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ లో ప్లాట్ ఫామ్ 4కు కుషినగర్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. ప్లాట్ ఫారమ్ పై ఉన్న రైలును శుభ్రం చేస్తుండగా.. టాయిలెట్ చెత్తబుట్టలో చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులు, సీనియర్ రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి రాజవాడి ఆస్పత్రికి తరలించారు. చిన్నారి గొంతుకోసి చంపి చెత్తబుట్టలో దాచారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా..చిన్నారి కుటుంబం గుజరాత్ లో ఉంటున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గుజరాత్ లో చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు నాసిక్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ముంబాయికి బయలుదేరేందుకు కుషినగర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి ఉంటారని అనుమానిస్తున్నారు. చిన్నారిని రైలులోనే హత్య చేసి మృతదేహాన్ని రైలు బాత్రూమ్ లోని చెత్తబుట్టలో కుక్కి పరారయ్యారని తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నామని..చిన్నారి హత్యలో బంధువుల పాత్ర ఉండవచ్చని తెలిపారు. చిన్నారి మృతదేహాన్నిపోస్టుమార్టంకు పంపినట్లుగా పేర్కొన్నారు.