Site icon vidhaatha

EMI Facility F0r Bribes | లంచాలకూ ఈఎంఐ ఫెసిలిటీ.. గుజరాత్‌ అవినీతి అధికారుల ఉదారత్వం!

EMI Facility F0r Bribes | ఎవరు చెప్పారండీ.. అవినీతి అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారని? ఎవరు చెప్పారండీ.. అవినీతి అధికారులకు మనసు లేదని! ఈ కథనం చూస్తే వారిలోనూ ఎంతో మానవీయత  ఉందని ఒప్పుకోక తప్పదేమో! గుజరాత్‌ అవినీతి అధికారులు ఎంత ఉదార స్వభావం కలిగినవారంటే.. ఎదుటివారికి ఆర్థికంగా భారం పడకుండా.. లంచాలను సైతం ఈఎంఐ తరహాలో చెల్లించుకునేందుకు పెద్ద మనసు కలిగినవారు. ఇందుకు సంబంధించిన పాత వార్తాకథనం క్లిప్పింగ్‌ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్‌ అయింది. అన్ని రాష్ట్రాల తరహాలోనే గుజరాత్‌లోనూ భారీగానే అవినీతి కేసులు వెలుగు చూస్తున్నాయి. 2021 – 2022 నుంచి రికార్డెడ్‌ అవినీతి కేసులలో 16.5 శాతం పెరుగుదల ఉందని 2024 జూన్‌లో బిజినెస్‌ స్టాండర్డ్స్‌ వార్త పేర్కొంటున్నది.

ఏదైనా పని కోసం వచ్చేవారి నుంచి ప్రభుత్వాధికారులు, ప్రత్యేకించి, పోలీసు, రెవెన్యూ అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన ఘటనలు కోకొల్లలు. అయితే.. ఒకేసారి బాధితులపై భారం పడకూడదని ఆలోచించిన సదరు అధికారులు.. వాయిదాల పద్ధతిలో అప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం లంచం ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారట.  ఒక కేసులో 40 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన ఒక అధికారి.. నాలుగు విడతల్లో పది లక్షల చొప్పున చెల్లించేందుకు పెద్ద మనసుతో ఒప్పుకొన్నాడు. ఇలాంటివే ఆ ఏడాది దాదాపు నాలుగు వెలుగు చూశాయని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు.

మరో కేసుకు సంబంధించి.. బాధితుడు 21 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే.. ఆ అధికారి ఒకేసారి మొత్తం డబ్బులూ డిమాండ్‌ చేయలేదు. దానికి బదులు ముందు రెండు లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించుకుని, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని 9 ఈఎంఐలలో చెల్లించే వెసులుబాటు కల్పించాడని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంటున్నది. ఇదే గుజరాత్‌లో ఒక గ్రామస్తుడి పొలం పంచాయితీని పరిష్కరించేందుకు ఒక ఉప సర్పంచ్‌, తాలూకా పంచాయతీ సభ్యుడు 85వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేశాడని, అయితే దానిని మూడు సమభాగాల్లో చెల్లించే సదుపాయం కల్పించాడని మరో వార్త పేర్కొంటున్నది. పోలీసులు కూడా తక్కువేమీ కాదు. గుజరాత్‌లోని సబర్‌కంఠ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి ఇద్దరు పోలీసులు 4 లక్షలు లంచం వసూలు చేసి పారిపోయారు. వాస్తవానికి ఈ కేసులో వారు తీసుకున్నది తొలి మొత్తమే. మొత్తంగా వారు డిమాండ్‌ చేసింది పది లక్షలు. గుజరాత్‌లో ఈ ధోరణి పెరుగుతున్నదని అప్పట్లో  ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

మొత్తానికి ఇది పాత వార్తే అయినా.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం విభిన్న స్పందనలకు కారణమైంది. ఇలాంటి మనసున్న అవినీతి అధికారులకు మీరిచ్చే సలహా ఏంటి? వారి గొప్ప తనానికి ఎలాంటి మెడల్స్‌ ఇవ్వాలి? అని  ఒక యూజర్‌ ప్రశ్నించాడు. ఏమీలేదు.. డైరెక్ట్‌గా వారిని తీసుకెళ్లి జైల్లో పడేయాలి.. అని మరొకరు స్పందించారు. మరొక వ్యక్తి సరదాగా.. ఈఎంఐకి వడ్డీ ఎంత? అని ప్రశ్నించారు. కొందరైతే ఆ అధికారులు ఎంత దయ కలిగినవారో అంటూ సెటైర్లు వేశారు.

Exit mobile version