Bhole Baba | ఎవ‌రీ భోలే బాబా..? 100 మంది చావుకు కార‌ణ‌మైన ఈ బాబా ఇంటెలిజెన్స్ బ్యూరోలో నిజంగానే ప‌ని చేశాడా..?

Bhole Baba | అస‌లు ఈ భోలే బాబా ఎవ‌రు..? ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం ఏంటి..? మొద‌ట్నుంచి ఆయ‌న బాబానేనా..? అస‌లు ఆయ‌న ఎవ‌రు..? అనే అంశాల‌పై నెటిజ‌న్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మ‌రి ఆయ‌న ఎవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

  • Publish Date - July 2, 2024 / 10:08 PM IST

Bhole Baba | ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం హ‌హాకారాలు, రోద‌న‌ల‌తో క‌న్నీటి సంద్రంగా మారింది. శివ‌రాధాన‌కు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్త‌జ‌నం తిరిగి వెళ్తుండ‌గా తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులే అధికంగా ఉన్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌థ్రాస్ జిల్లాలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నిర్వ‌హించారు.

అయితే ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం భోలే బాబా ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. అస‌లు ఈ భోలే బాబా ఎవ‌రు..? ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం ఏంటి..? మొద‌ట్నుంచి ఆయ‌న బాబానేనా..? అస‌లు ఆయ‌న ఎవ‌రు..? అనే అంశాల‌పై నెటిజ‌న్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మ‌రి ఆయ‌న ఎవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

ఎవ‌రీ భోలే బాబా..?

జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ భోలే బాబా అస‌లు పేరు నారాయ‌ణ్ శ‌క‌ర్ హ‌రి. యూపీలోని ఎటా జిల్లాలోని బ‌హ‌దూర్ న‌గ‌రి గ్రామం. హ‌రి భార్య మాన‌వ్ మంగ‌ళ్ మిలాన్ స‌ద్భావ‌న స‌మ‌గం పేరిట ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. గ‌తంలో తాను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప‌ని చేసిన‌ట్లు చెప్పుకున్నారు.

భోలే బాబాగా ప్ర‌సిద్ధి గాంచిన ఈ హ‌రి.. కాషాయం దుస్తులు ధ‌రించ‌డు. కేవ‌లం తెలుపు రంగులో ఉండే దుస్తులు మాత్రమే ధ‌రిస్తాడు. సంపాదించిన డ‌బ్బునంతా త‌న భ‌క్తుల కోస‌మే ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు చెప్పాడు. ఇక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ప‌ని చేసిన‌ప్పుడు కూడా తాను ఆధ్యాత్మికంలో మునిగి తేలేవాడిన‌ని త‌న భ‌క్తుల‌కు వివ‌రిస్తుంటాడు. ఆధ్యాత్మిక‌ను అంద‌రికి పంచాల‌నే ఉద్దేశంతోనే 1990లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగానికి రాజీనామా చేశాన‌ని, అప్ప‌ట్నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితానికే అల‌వాటు ప‌డ్డాన‌ని చెప్పాడు.

గ‌తంలోనూ భోలే బాబా ప‌లు ఈవెంట్లు నిర్వ‌హించి కేసుల పాల‌య్యాడు. 2022 మే నెల‌లో కొవిడ్ పీక్ స్టేజీలో ఉన్న‌ప్పుడు ఈ మాదిరిగానే ఓ ఆరాధ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించాడు. క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించాడ‌నే కార‌ణంగా భోలే బాబాపై కేసులు న‌మోదు అయ్యాయి. పోలీసులు కేవ‌లం 50 మందికి అనుమ‌తిస్తే.. ఆయ‌న మాత్రం 50వేల మందికి అనుమ‌తించాడు.

ఇక భోలే బాబాకు ఓ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. 31 వేల మంది ఆ ఛానెల్‌ను ఫాలో అవుతున్నారు. ఈయ‌న‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్, హ‌ర్యానా, ఢిల్లీలో భ‌క్తులు ఉన్నారు. భోలే బాబా ఆశీర్వాదం కోసం ఈ ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తుంటారు.

జులై 2వ తేదీన చోటు చేసుకున్న తాజా ఘ‌ట‌న‌తో భోలే బాబాపై మ‌రోసారి ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌త‌స్థాయి క‌మిటీ ఏర్పాటు చేసి విచార‌ణ చేప‌ట్టాల‌ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ అధికారుల‌ను ఆదేశించారు.

Latest News