ఈఓ ఆదేశాలమేరకు సింహాచలం ఆలయంలో క్లీన్ డ్రైవ్

  • Publish Date - May 29, 2021 / 11:38 AM IST
 11,12,13  శతాబ్దాలనాటి శిల్పకళా సౌందర్యం , అలనాటి శాసనాలు, ఆధ్యత్మిక శోభకు  పుట్టినిల్లు... మన సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం. అయతే కొంతమంది నేటి తరం భక్తులకు ఆ విశేషాలు తెలియవు.  వెయ్యేళ్లకుపైబడ్డ చరిత్ర ఉన్న... శ్రీ మహావిష్ణువు అవతారాలు, శిల్పాలు దేవస్థానం గోడలపై, స్థంబాలపై చెక్కబడినవి. వాటి వివరాలను భక్తులకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ... ఆలయ EO ఎంవీ సూర్యకళ గారు... వాటిని సంప్రదాయ బద్ధంగా శుభ్రపరిచి, ప్రతి శిల్పం దగ్గర దానివివరాలతో  బోర్డులు పెట్టి  పునరుద్ధరించాలని నిర్ణయించారు. అంతేకాదు వాటి ఫొటోలు, విశేషాలతో మ్యూజియంలోనూ భద్రపరచబోతున్నట్లు చెప్పారు. దేవాలయంలో  విష్ణుమూర్తి అవతారాల శిల్పాలు, రాతి రథం, నాగ బంధాల్లాంటివి చాలా ఉన్నాయని... వాటన్నింటినీ పరిశీలించానని... తనకే ఒకటి రెండు శిల్పాల వివరాలు తెలియకపోవడంతో అర్చకులు, స్థలపురాణం పుస్తకాలను రిఫర్ చేసి తెలుసుకున్నానని చెప్పారు. EO సూర్యకళగారి ఆదేశాల మేరకు ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ , అధికారులు దగ్గరుండి శుభ్రపరిచి, శిల్పాలు పాడవకుండా ఉండటానికి ప్రత్యేక తైలం ఉపయోగించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు భక్తులకు ఈ అవతారాలు మరింత స్పష్టంగా కనిపిస్తుంటంతో... వారు జాగ్రత్తగా పరిశీలిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ చందన రూపుడి ఆలయంలోని  శిలా శాసనాలు చారిత్రక పరిశోధకులను సైతం ఆకర్షిస్తున్నాయి. 
           

  

      
కరోనా సమయంలో భక్తులకు పరిమిత సమయంలో మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంది కాబట్టి… మిగతా సమయంలో ఆలయ పరిశుభ్రత, శుద్ధిపై దృష్టి పెట్టామని చెప్పారు ఆలయ EO సూర్యకళ . ఈ కరోనా కర్ఫ్యూని కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకుంటున్నామన్నారు. ఆలయంలోని, భాండాగారం దగ్గర ఇత్తడి గ్రిల్స్ కూడా తళతళా మెరిసేలా శుభ్రపరిచామని చెప్పారు. ఛైర్ పర్సన్ సంచయిత గజపతి … ఆలయ ప్రాశస్త్యం నేటి తరానికి తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు.