విధాత : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్‌పై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. హిందువులకు ప్రకాష్‌రాజ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య తిరుపతి లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మంపై ట్విట్టర్ వార్ నడిచిన విషయం తెలిసిందే. ప్రకాశ్ హిందు మత విశ్వాసాలు, నమ్మకాలపై తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆయనపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నాయి.
తాజాగా రాముడిపైన, రామాయణంపైన ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయనే ఆరోపణలపై దేశ వ్యాప్తంగా ఆయనపై పలు క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయి. కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వ్యంగ్యంగా చెబుతూ.. రాముడు, లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలని, వారిద్దరూ దక్షిణ భారత్‌కు చెందిన గిరిజనుడైన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారని పేర్కొన్నాడు. అయితే, దానిని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని అడిగినట్లు ఎద్దేవా చేశాడు. ఈ కారణం వల్లనే రామ, రావణ యుద్దం జరిగిందంటై వెటకారంగా కామెంట్ చేశాడు.
ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాంప్రదాయ ఇతిహాస కథనాన్ని వక్రీకరించినందుకు నెటిజన్లు కూడా విరుచుకుపడుతున్నారు. హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రకాష్ రాజ్ మొదటి హేతువాద భావాలను, నాస్తికత్వాన్ని బహిరంగంగానే ప్రకటిస్తుంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను, హిందూత్వ భావజాలాన్ని విమర్శించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే అభ్యుదయ భావాల పేరుతో ఆయన చేసే విమర్శలు తరచుగా ఒక వర్గపు విశ్వాసాలను కించపరిచేలా ఉంటున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
