Vikram | ప్రయోగాల‌కి కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్ .. ఇప్పుడు ఎందుకు ఇలా నిరాశ‌ప‌రుస్తున్నాడు?

Vikram | భారతీయ సినీ ప్రపంచంలో ప్రయోగాత్మక చిత్రాలకు, విభిన్నమైన పాత్రలకు మారుపేరుగా నిలిచిన లెజెండరీ నటుడు కమల్ హాసన్ తర్వాత అదే దారిలో సాగిన నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. తన కెరీర్ మొత్తం సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన విక్రమ్, ఒక దశలో తన నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

Vikram | భారతీయ సినీ ప్రపంచంలో ప్రయోగాత్మక చిత్రాలకు, విభిన్నమైన పాత్రలకు మారుపేరుగా నిలిచిన లెజెండరీ నటుడు కమల్ హాసన్ తర్వాత అదే దారిలో సాగిన నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. తన కెరీర్ మొత్తం సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన విక్రమ్, ఒక దశలో తన నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

విక్రమ్ తన కెరీర్‌ను తమిళ చిత్రం ‘ఎన్ కాదల్ కన్మణి’తో ప్రారంభించి, తెలుగులో ‘చిరునవ్వుల వరమిస్తావా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ప్రారంభంలో చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆయన తన దారిని మార్చుకుని ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేశారు.

ప్ర‌యోగాలు వ‌ద‌ల్లేదు..

అతని కెరీర్‌కు మలుపు తీసుకువచ్చిన చిత్రం సేతు. దర్శకుడు బాల తెరకెక్కించిన ఈ సినిమాలో మానసిక రోగిగా నటించడానికి విక్రమ్ 20 కిలోలకు పైగా బరువు తగ్గడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుని, విక్రమ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టింది.

ఆ తర్వాత కూడా ప్రయోగాల బాటను వదలకుండా, అంధుడి పాత్రలో ‘కాశి’, మాటలేమీ లేకుండా హావభావాలతోనే ఆకట్టుకున్న పితామగన్ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘పితామగన్’ చిత్రానికి ఆయన జాతీయ పురస్కారం అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

శరీరాన్ని పూర్తిగా మార్చుకున్న విక్ర‌మ్..

ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ విక్రమ్ తన ముద్ర వేసుకున్నారు. ‘సామి’, ‘జెమిని’, ‘ధూల్’ వంటి యాక్షన్ చిత్రాలు ఆయనకు మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. అయితే విక్రమ్ నటనలోని విశ్వరూపాన్ని చూపించిన చిత్రం అపరిచితుడు. ఇందులో బహుళ వ్యక్తిత్వాలతో కూడిన పాత్రను పోషిస్తూ ఒక్కో సెకనుకే భావాలను మార్చిన ఆయన నటన ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

తర్వాత ‘నాన్న’లో మేధో వైకల్యం ఉన్న వ్యక్తిగా, ‘ఐ’లో విభిన్న గెటప్‌లలో, ‘కోబ్రా’లో ఏడు వేషధారణల్లో, ‘తంగలాన్’లో గిరిజన నాయకుడిగా నటిస్తూ తన ప్రయోగాల పరంపరను కొనసాగించారు. ప్రతి పాత్ర కోసం శరీరాన్ని, మనసును పూర్తిగా మార్చుకునే ఆయన నిబద్ధత ప్రత్యేకంగా నిలుస్తుంది.

మ్యాజిక్ త‌గ్గింది..

అయితే ఇటీవల కాలంలో విక్రమ్‌కు వరుస విజయాలు దక్కడం లేదు. గతంలో కనిపించిన మ్యాజిక్ ఇప్పుడు తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన కెరీర్ కొంతమేర మందగించింది.

ప్రస్తుతం విక్రమ్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. మళ్లీ తనదైన శైలిలో సరికొత్త కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో చూపించిన అదే డెడికేషన్, కొత్తదనం కొనసాగిస్తే విక్రమ్ మరోసారి శిఖరాగ్రాన్ని చేరుకోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest News