Road Accident | తమిళనాడులో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్ట్ వాహనం లోయలో పడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 13 మంది టూరిస్టు వాహనంలో తమిళనాడు నుంచి తిరిగి సొంతూరుకి బయల్దేరారు. తమిళనాడులోని వల్పరై – పొలచ్చి హిల్ రోడ్డులో టూరిస్టు వాహనం అదుపు తప్పింది. ఘాటు రోడ్డులో ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనాస్థలిలో 8 మంది చనిపోగా, ఒకరు పొలచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో, గాయపడిన వారిలో చాలా మంది టీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మల్లప్పురం వాసులు అని సమాచారం. వల్పరై నుంచి మల్లప్పురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
