Women’s Quota Bill | వీగిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు.. కుప్ప‌కూలిన కుట్ర‌

Women's Quota Bill | తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు, అక్కడున్న ప్రాంతీయ పార్టీలను మట్టికరిపించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.

సభలో బలం లేదని తెలిసి కూడా బిల్లు
తమిళ, బెంగాల్ ఎన్నికల కోసమేనా
బీజేపీ నేతల చిత్తశుద్ధి బట్టబయలు

Women’s Quota Bill | విధాత, హైదరాబాద్ : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు, అక్కడున్న ప్రాంతీయ పార్టీలను మట్టికరిపించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తెలిసి కూడా బీజేపీ నాయకులు సవరణ బిల్లును ప్రవేశపెట్టి ప్రతిపక్ష పార్టీలను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేసి తానే చిక్కుకుపోయింది. దేశంలో పన్నెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు ఎన్నడూ గుర్తుకు రాని మహిళా రిజర్వేషన్ బిల్లు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు గుర్తుకురావడం శోచనీయం అంటున్నారు రాజకీయ నిపుణులు. చిత్తశుద్ధి లేకుండా ప్రవేశపెట్టిన బిల్లు చెత్తబుట్ట పాలైందనే విమర్శలను బీజేపీ మూటగట్టుకున్నది. మహిళల పేరుతో డీలిమిటేషన్ దొంగ అజెండా నెట్టాలని చూసిన బీజేపీ కుట్రకోణం బహిర్గతమైంది. ఉత్తర భారతానికి సీట్లు పెంచుకుని అధికారాన్ని కాపాడుకోవాలన్న ఆశ కూలిపోయింది. మహిళా రిజర్వేషన్ పేరుతో బీజేపీ చేసిన మోసం దేశ ప్రజల ముందు బట్టబయలైంది. ఇది బీజేపీకి రాజకీయ పరాభవం… ప్రజాస్వామ్యానికి మహా విజయం అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు.

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి లోక్‌సభలో 352 సభ్యుల మద్ధతు అవసరం కాగా, 298 మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. మెజారిటీకి 54 ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఇక చేసేది లేక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకోక తప్పలేదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ప్రతిపక్ష పార్టీలలో చీలిక తెచ్చి, బిల్లుపై ఓటింగ్ జరిగిన సమయంలో సభ నుంచి వారిని బయటకు పంపించి మెజారిటీ నిరూపించుకోవాలని ప్రయత్నించిన బీజేపీకి ఇది పెద్ద శరాఘాతం అని అభిప్రాయపడుతున్నారు. సమాజ్ వాదీతో పాటు ఇతర పార్టీల సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం పెద్ద అవరోధంగా మారింది. మహిళా రిజర్వేషన్‌తో పాటు ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు చేసిన వినతులను బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. బీజేపీ రెండు రాష్ట్రాల్లో గెలుపు కోసం తొందరపాటు కన్పించింది తప్ప మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే తపన కనిపించ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే లోక్‌సభ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లు పరాభవాన్ని ఎదుర్కొన్నారని అభిప్రాయపడుతున్నారు.

శుక్రవారం నాటి లోకసభలో మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ చేసిన మాయోపాయం పారలేదని తేలిపోయింది. దేశంలో అక్రమ చట్టాలకు మహిళలను అడ్డుపెట్టి ఆమోదించాలనే కుతంత్రం నిలబడలేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధికారిత పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయాలనే బీజేపీ కుయుక్తులు చిత్తు అయ్యాయి. ప్రజాస్వామ్యం నిలబడడంలో భారత దేశ ప్రజల విజయంగా చెప్పుకోవాలి. మహిళల పేరుతో నీచ రాజకీయాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, మత పిచ్చి బీజేపీకి ఇది చెంపపెట్టు అనే విమర్శలు గుప్పుమంటున్నాయి. లోకసభలో వీగిపోయింది అతి గతి లేని డీలిమిటేషన్ బిల్లే తప్ప మహిళా బిల్లు కానే కాదంటున్నారు. విపక్షాలు ఆనాడైనా ఈనాడైనా మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు అని అన్ని వేదికల మీద గొంతెత్తుతున్నాయి.. కాని బీజేపీ పాలకులు మహిళల పేరుతో తెచ్చింది డీలిమిటేషన్ బిల్లు మాత్రమే. కాని ఇవ్వాళ వీగిపోయింది నియోజక వర్గాల పునర్విభజన బిల్లేనని స్పష్టమవుతున్నది. అయినా బీజేపీ పాలకులు ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రను ప్రతిపక్షాలు తిప్పికొట్టాయని అనేది తేటతెల్లమైంది. మహిళా బిల్లుకు ఆమోదం దక్కింది 2023 లోనే అయినా ఇప్పుడెందుకు తొందరపడుతుందో దేశ ప్రజలకు తెలిసిపోయింది. ప్రతిపక్షాలపై బురదజల్లడం మాని ఇప్పటికైనా … మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 వెంటనే అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మహిళల పేరుతో డీలిమిటేషన్ దొంగ అజెండా నెట్టాలని చూసిన బీజేపీ కుట్ర బహిర్గతమైంది. ఉత్తర భారతానికి సీట్లు పెంచుకుని అధికారాన్ని కాపాడుకోవాలన్న కుట్ర కుప్ప కూలిపోయింది. ఓబీసీ మహిళలకు న్యాయం చేయకుండా బీజేపీ అసలు ముఖం బయటపడిందని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. మహిళల పేరుతో రాజకీయాలు చేసిన మోదీ ప్రభుత్వం నైతికంగా పూర్తిగా ఓడిపోయిందని ప్రతిపక్ష మహిళా నాయకురాళ్లు ఆరోపిస్తున్నారు. కుల గణన లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు అంటే సామాజిక అన్యాయమని కాంగ్రెస్ చెప్పిందే నిజమైంది. 2023లో మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 2029 వరకు వాయిదా వేసి మధ్యలో డీలిమిటేషన్ చేయాలన్న బీజేపీ ప్లాన్ ఫెయిల్ అయింది. సంపన్న మహిళలకు మాత్రమే కాదు… సామాన్య మహిళలకు అవకాశాలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచన, డిమాండ్ కూడా. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో లింక్ చేయడం, ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ మోసం అనేది స్పష్టమవుతున్నది. తెలంగాణలో మాదిరిగా దేశవ్యాప్తంగా జనగణనలో కుల గణన చేసి నిజమైన సామాజిక న్యాయం చేసినప్పుడే బీజేపీ చిత్తశుద్ధి నిరూపితమవుతుంది. మహిళల భావోద్వేగాలతో ఆడుకున్న బీజేపీకి ప్రతిపక్షాలు సభలో గట్టి సమాధానం ఇచ్చారు.

Latest News