PMSYM Yojana | పీఎం–ఎస్‌వైఎమ్ స్కీమ్ ను 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రారంభించింది. అసంఘటిత రంగంలోని కార్మికులు దీనికి అర్హులు. అయితే వీరి నెల జీతం రూ.15 వేలకు మించవద్దు. 18-40 ఏళ్ల వయస్సున్న వారు ఈ పథకంలో చేరవచ్చు. అయితే కొత్త పెన్షన్ పథకం, ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి రాని వారే ఈ పెన్షన్ స్కీమ్ కు అర్హత పొందుతారు. దీనికి తోడు ఐటీ ట్యాక్స్ చెల్లించే జాబితాలో వీరు ఉండవద్దు. 18 ఏళ్ల సమయంలో ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 55 చెల్లించాలి. 20 ఏళ్లలో రూ.61, 25 ఏళ్లలో రూ.80, 30 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.105, 35 ఏళ్లలో రూ.150, 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ. 200 చెల్లించాలి. సభ్యుడు చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వం కూడా డబ్బులు జమ చేస్తుంది. అంటే రూ.55 సభ్యుడు చెల్లిస్తే ప్రభుత్వం కూడా రూ.55 తన వాటా కింద జమ చేస్తుంది.
లాభాలు ఏంటి?
ఈ స్కీమ్ లో చేరిన సభ్యులు 60 ఏళ్ల వరకు డబ్బులు చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల రూ. 3 వేల పెన్షన్ వస్తుంది. ఒకవేళ పెన్షన్ పొందుతున్న సమయంలో ఆ సభ్యుడు మరణిస్తే ఆయన భార్యకు సగం పెన్షన్ ను ఇస్తారు. ఒక వేళ 60 ఏళ్లకు ముందే సభ్యుడు మరణిస్తే ఇందులో నుంచి బయటకు రావచ్చు. లేదా స్కీమ్ లో కొనసాగేందుకు సభ్యుడి జీవిత భాగస్వామికి అవకాశం కల్పిస్తారు.
ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
పీఎం-ఎస్‌వైఎమ్ పథకంలో చేరడానికి బ్యాంకు ఖాతా, మొబైల్ ఫోన్.. ఆధార్ నంబర్ కచ్చితంగా ఉండాలి. ఈ స్కీమ్ లో చేరాలనుకున్న వారు సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC e Governance Services India Limited (CSC SPV)) లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. లేదా PM-SYM పోర్టల్ లో లేదా మొబైల్ యాప్ లో వివరాలు నమోదు చేసి ఈ స్కీమ్ లో చేరవచ్చు.
మధ్యలో నిలిపివేస్తే డబ్బులు వస్తాయా?
ఏదైనా కారణంతో ఈ పథకంలో చేరిన సభ్యులు మధ్యలో దీన్ని నిలిపివేస్తే నష్టం లేదు. ఈస్కీమ్ లో చేరిన సభ్యుడికి మూడేళ్ల తర్వాత ఉద్యోగం వస్తే ( అసంఘటిత రంగం నుంచి ఇతర రంగాల్లోకి వెళ్తే) ఆ ఖాతా యాక్టివ్ గా ఉంటుంది. అయితేప్రభుత్వం ఇచ్చే 50 శాతం మాత్రం జమ కాదు. ఈ స్కీమ్ లో కొనసాగాలంటే నెల నెల మీరు చెల్లించే డబ్బు చెల్లిస్తే సరిపోతోంది. 60 ఏళ్ల తర్వాత ఈ డబ్బును వడ్డీతో సహా తీసుకోవచ్చు.