Akhanda 2 | బోయపాటి శ్రీను–బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2’ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమయ్యిందని భావించిన సమయంలో ప్రీమియర్ షోలను రద్దు చేయడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన సినిమా ఇలా అకస్మాత్తుగా ఆగిపోవడం పట్ల బాలయ్య ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చివరి నిమిషంలో షోలు స్టాప్
సినిమా విడుదలకు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఈ అడ్డంకులు రావడం సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. కేవలం కొన్ని నిమిషాల్లో ప్రీమియర్ షోలకు సంబంధించిన అన్ని స్క్రీనింగులు రద్దు కావడంతో కలకలం చెలరేగింది.
వాయిదా వెనుక కారణం ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు?
ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు విధించిన స్టే తొలగించడానికిగాను అవసరమైన బకాయిలు నిర్మాతలు చెల్లించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కోర్టు ఈరోజు తెరుచుకున్న వెంటనే ఫిర్యాదుదారులు చెల్లింపులు అందాయని తెలపగానే స్టే ఎత్తివేసే అవకాశముందని తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈరోజే (డిసెంబర్ 5) రాత్రి ప్రీమియర్లకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 6 నుంచి రెగ్యులర్ షోలు ప్రారంభం అవుతాయి అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నైజాం ప్రాంతంలో బుకింగ్స్ పరిస్థితి కూడా ఇదే వార్తలను బలపరుస్తోంది. డిసెంబర్ 5కు టికెట్లు కనిపించడం లేదు కానీ డిసెంబర్ 6 షోలు మాత్రం ఓపెన్ అయ్యాయి. అంటే విడుదల కేవలం 24 గంటలు ఆలస్యమయ్యే సూచనగా ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
మేకర్ల నిర్లక్ష్యం కారణమా?
గతంలో కూడా సినిమా సెప్టెంబర్‌లో రానుందని ప్రచారం జరిగి, VFX పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది.ఇప్పుడు టెక్నికల్ కారణాలు కాకుండా పూర్తిగా ఫైనాన్షియల్ సమస్యల కారణంగా ఈ గందరగోళం వచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ విషయంలో నిర్మాతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈరోజు మధ్యాహ్నానికే క్లారిటీ?
ఫైనాన్షియల్ ఇష్యూలు దాదాపు క్లియర్ అయినట్లు సమాచారం రావడంతో, సినిమా విడుదలపై ఈరోజు మధ్యాహ్నానికే అధికారిక నిర్ధరణ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘అఖండ 2’ విడుదల పూర్తిగా ఆగిపోలేదు… కేవలం 24 గంటల ఆలస్యంతో థియేటర్లలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది టాలీవుడ్ టాక్.
