Anil Ravipudi | టాలీవుడ్‌లో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్స్ నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను నవ్విస్తూ, ఎంటర్‌టైన్ చేస్తూ ముందుకు సాగుతోంది. ‘పటాస్’ నుంచి ఇప్పటి వరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాలు వరుసగా సక్సెస్ అవడం విశేషం. అయితే ఈ సక్సెస్ జర్నీ అంత ఈజీగా రాలేదు. ఆయన సినిమాలపై ఎప్పటినుంచో ఒక విమర్శ ఉంటుంది. “గొప్ప కథలు ఉండవు… లాజిక్ కంటే కామెడీ ఎక్కువ” అనే కామెంట్లు నెటిజన్ల నుంచి వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే, అనిల్ రావిపూడి ప్రతి సారి అదే విమర్శలను తన సినిమాల సక్సెస్‌తో తప్పు అని నిరూపిస్తూనే ఉన్నాడు.
అనిల్ ప్రత్యేకత ఏంటంటే… పెద్ద పెద్ద ట్విస్టులు, క్లిష్టమైన కథలతో కాకుండా సింపుల్ స్టోరీని తీసుకుని దానిని ఎంటర్‌టైనింగ్ స్క్రీన్‌ప్లేగా మార్చడం. ఆడియన్స్ థియేటర్‌లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి బయటికి వచ్చే వరకు బోర్ కొట్టకుండా నవ్వించేలా, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగేలా సినిమాను డిజైన్ చేయడంలో ఆయన మాస్టర్‌గా మారిపోయాడు. కాస్టింగ్ ఎంపిక, టైమింగ్, డైలాగ్స్ అన్ని కలిసొచ్చి సినిమాను సక్సెస్ ట్రాక్‌లో నిలబెడతాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలో కూడా మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రమోషనల్ కంటెంట్ చూసి “ఈసారి అనిల్ దొరికేస్తాడు” అని కొందరు కామెంట్లు చేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వింటేజ్ చిరంజీవిని స్క్రీన్‌పై చూపించి, మెగా ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌ను కూడా మెప్పించడంలో అనిల్ మరోసారి సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమాలో చిరంజీవి ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను పాత రోజులను గుర్తు చేసేలా చేసింది. అదే సమయంలో కథను అవసరం లేని ట్విస్టులు, లాజిక్ టెస్టులతో క్లిష్టం చేయకుండా, లైట్‌గా తీసుకెళ్లడం అనిల్ స్టైల్‌కు మరో ఉదాహరణగా నిలిచింది. బ్రెయిన్‌కు స్ట్రెస్ ఇవ్వని కథ, కానీ హార్ట్‌ను టచ్ చేసే ఎంటర్‌టైన్‌మెంట్ ఇదే ఆయన సినిమాల ఫార్ములా. ప్రస్తుతం సినిమాల విజయాన్ని కొలిచే అసలైన ప్రమాణం ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా థియేటర్ నుంచి హ్యాపీగా బయటకు రావడమే. ఆ విషయంలో అనిల్ రావిపూడి మరోసారి తన బలాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన రూపొందించిన ఈ సినిమా, సంక్రాంతి వేళ థియేటర్లలో నిజమైన పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి, “ఈసారి అయినా దొరికేస్తాడు” అనుకున్నవాళ్లకు మరోసారి నిరాశే ఎదురైంది.anil
