Dandora | బ‌లగం సినిమా స్థాయిలో దండోరా ఉంది.. మంత్రి కోమ‌టి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

Dandora | తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలు ఈ మధ్య ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ జీవితం, అక్కడి అనుబంధాలు, సామాజిక సమస్యలను నిజాయితీగా చూపిస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ‘

Dandora | తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలు ఈ మధ్య ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ జీవితం, అక్కడి అనుబంధాలు, సామాజిక సమస్యలను నిజాయితీగా చూపిస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ‘బలగం’ సినిమా తెలంగాణ పల్లె జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తెలంగాణ నేపథ్యంతో వచ్చిన మరో చిత్రం ‘దండోరా’.

మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దండోరా’ సినిమాలో శివాజీ, బిందు మాధవి, నవదీప్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. తెలంగాణా ఆర్ & బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేశారు. విడుదల అనంతరం ఈ సినిమాపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ లెంగ్తీ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

తన సందేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… “తెలంగాణ నేల నుంచి పుట్టిన ఈ చిత్రం సామాజిక అంశాలను మనసును తాకేలా ఆవిష్కరిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలుపుతుంది. గ్రామీణ జీవనశైలి, మనుషుల మధ్య ఉన్న సూక్ష్మ సంబంధాలను సహజంగా చూపిస్తూ నిజ జీవితానికి అద్దం పడుతుంది” అని పేర్కొన్నారు. మన చుట్టూ నిత్యం కనిపిస్తూనే పట్టించుకోని ఒక సామాజిక సమస్యను సున్నితంగా ప్రశ్నిస్తూ ఆలోచనకు దారితీసే సినిమా ‘దండోరా’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, ‘బలగం’ తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన సినిమా ‘దండోరా’ అని ప్రశంసించారు. వినోదంతో పాటు విలువైన సందేశాన్ని అందించిన ‘దండోరా’ టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మంత్రి చేసిన ఈ ప్రత్యేక పోస్ట్ సినిమాకు మంచి బూస్ట్ ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ‘దండోరా’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో మౌత్ టాక్ ఇంకా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమా ఫలితం ఏదైనా, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్రశంసలు అందుకోవడం చిత్ర బృందానికి పెద్ద ప్లస్‌గా మారింది. దీంతో మరికొంతమంది ప్రేక్షకుల దృష్టిని ‘దండోరా’ వైపు ఆకర్షించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

‘దండోరా’కి పోటీగా అదే సమయంలో రోషన్ నటించిన ‘ఛాంపియన్’, ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ సినిమాలు కూడా థియేటర్లలో విడుదలయ్యాయి. అయినా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాగా ‘దండోరా’పై ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. ఇలాంటి సినిమాల ఫలితాలు మరిన్ని తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కథలను తెరకెక్కించేందుకు ప్రోత్సాహం కలిగిస్తాయని సినీ పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Latest News