Oscar Nominations | 98వ ఆస్కార్ నామినేషన్స్ … ‘సిన్నర్స్’ సంచలనం, భారత్‌కు మరోసారి నిరాశ

Oscar Nominations | ఆస్కార్… అది ఇప్పటికీ భారతీయ సినిమాకు ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎన్నో దశాబ్దాలుగా మన సినిమాను ఊరిస్తున్న ఆ అంతర్జాతీయ గౌరవం, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దక్కినప్పుడు ఒక్కసారిగా కల నిజమైనట్టయింది.

Oscar Nominations | ఆస్కార్… అది ఇప్పటికీ భారతీయ సినిమాకు ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎన్నో దశాబ్దాలుగా మన సినిమాను ఊరిస్తున్న ఆ అంతర్జాతీయ గౌరవం, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దక్కినప్పుడు ఒక్కసారిగా కల నిజమైనట్టయింది. అయితే ఆ ఘనత తర్వాత మళ్లీ ఏ భారతీయ సినిమా ఆస్కార్ నామినేషన్ల స్థాయికి చేరుకోలేకపోయింది. తాజాగా ప్రకటించిన 98వ అకాడమీ అవార్డుల నామినేషన్లలో కూడా భారత్‌కు చెందిన ఏ చిత్రం చోటు దక్కకపోవడం సినీ అభిమానులను నిరాశపరిచింది. అకాడమీ అవార్డ్స్ కమిటీ 2026 ఆస్కార్ నామినేషన్లను అధికారికంగా ప్రకటించింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అత్యుత్తమ చిత్రాల నుంచి ఎంపిక చేసిన జాబితాను వెల్లడించింది.

పాపులర్ చిత్రాలు, నటీనటులతో పాటు సాంకేతిక విభాగాలకు సంబంధించిన నామినేషన్లను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. మార్చి 15న ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల ప్రధాన వేడుక జరగనుంది. ఈ ఏడాది బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో మొత్తం 10 చిత్రాలు పోటీలో నిలిచాయి. ముఖ్యంగా రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిన్నర్స్’ చిత్రం ఏకంగా 16 విభాగాల్లో నామినేట్ అయి ఆస్కార్ రేస్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ‘ఆల్ అబౌట్ ఈవ్’, ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ వంటి చిత్రాలు అత్యధిక విభాగాల్లో నామినేషన్లు సాధించి రికార్డులు నెలకొల్పాయి. తాజాగా ఆ రికార్డులను ‘సిన్నర్స్’ అధిగమించడం విశేషంగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బెస్ట్ ఫిల్మ్ విభాగంలో బగోనియా, ఎఫ్-1, ఫ్రాంకిన్‌స్టన్, హ్యామ్‌నెట్, మార్టీ సుప్రీం, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ది సీక్రెట్ ఏజెంట్, సెంటిమెంటల్ వాల్యూ, సిన్నర్స్, ట్రైన్ డ్రీమ్స్ చిత్రాలు తుది పోటీలో నిలిచాయి.

బెస్ట్ డైరెక్టర్ విభాగంలో పాల్ థామస్ ఆండ్రూసన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), క్లోయి జావ్ (హ్యామ్‌నెట్), జాష్ షాఫ్టీ (మార్టీ సుప్రీం), రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), యో ఆకీమ్ ట్రియర్ (సెంటిమెంటల్ వాల్యూ) మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఉత్తమ నటుడు (బెస్ట్ యాక్టర్) విభాగంలో లియోనార్డో డికాప్రియో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), మైఖేల్ బి. జోర్డన్ (సిన్నర్స్), వాగ్నర్ మౌరా (ది సీక్రెట్ ఏజెంట్), తిమోతి చాలమేట్ (మార్టీ సుప్రీం), ఈథన్ హాక్ (బ్యూ మూన్) నామినేషన్లు దక్కించుకున్నారు.

బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో జస్సీ బక్లీ (హ్యామ్‌నెట్), రోజ్ బర్న్ (ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు), కేట్ హడ్సన్ (సాంగ్ సాంగ్ బ్లూ), ఎమ్మా స్టోన్ (బగోనియా), రెనాటా రైన్సావా (సెంటిమెంటల్ వాల్యూ) తుది జాబితాలో నిలవడం విశేషం.

ఇవే కాకుండా ఉత్తమ సహాయ నటుడు, సహాయ నటి, ఉత్తమ క్యాస్టింగ్, కాస్ట్యూమ్ డిజైన్, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫిల్మ్, యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, మేకప్ అండ్ హెయిర్ స్టైల్, ఒరిజినల్ స్కోర్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ సాంగ్ వంటి పలు విభాగాల్లో కూడా చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

మొత్తానికి ఈసారి ఆస్కార్ రేస్‌లో హాలీవుడ్, యూరోపియన్ సినిమాల హవానే కనిపిస్తుండగా, భారతీయ సినిమా మరోసారి పోటీకి దూరంగా నిలవడం అభిమానులకు నిరాశను మిగిల్చింది. అయినప్పటికీ భవిష్యత్తులో మరో ‘ఆర్ఆర్ఆర్’ తరహా ఘనత దక్కుతుందనే ఆశతో ఇండియన్ సినీ పరిశ్రమ ఎదురు చూస్తోంది.

Latest News