Back-to-Back World Champions: India Win T20 World Cup 2026 as Sanju Samson Smashes Records
🔸 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
🔸 తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సంజూ శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) తుఫాన్ ఇన్నింగ్స్‌లతో 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు చేసింది.
🔸 అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.
🔸 జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లతో కివీస్ బ్యాటింగ్‌ను కుదేలు చేశారు.
🔸 ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
🔸 ఫైనల్‌లో 89 పరుగులతో సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు.
విధాత క్రీడా విభాగం | 8 మార్చి 2026 | హైదరాబాద్:
భారత్ 2026 టి20 ప్రపంచకప్‌ను సగర్వంగా ఎత్తుకుంది. వరుసగా 2వసారి టి20 ప్రపంచకప్ సాధించిన తొలిజట్టుగా, మొత్తంగా 3 సార్లు టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సంజూశాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ల తుఫాన్ ఫిఫ్టీలతో 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రతిగా న్యూజీలాండ్ జట్టు 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో అభిమానుల హర్షధ్వానాల మధ్య భారత్ 2026 ప్రపంచకప్ విజేతగా అవతరించింది.
ఒత్తిడితో రెక్కలు విరిగిన కివీస్ బ్యాటర్లు
భారత్ విధించిన కొండంత లక్ష్యాన్ని అధిగమించి విజేతగా నిలవాలని బ్యాటింగ్‌కు దిగిన కివీస్ కాసేపు బాగానే ఆడినా, భారీ లక్ష్యపు ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికాతో రికార్డు సెంచరీ సాధించి మంచి ఊపుమీదున్న ఫిన్ అలెన్, తొలి వికెట్‌గా అక్షర్‌పటేల్‌కు బలై, పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే రచిన్ రవీంద్రను బుమ్రా ఔట్ చేయగా, అక్షర్ మళ్లీ చెలరేగి గ్లెన్ ఫిలిప్‌ను బౌల్డ్ చేయడంతో కివీస్ పూర్తిగా వెనుకడుగు వేసింది. తొలిసారి ఫైనల్ ఆడుతున్న కివీస్, దాంతోపాటు చేయాల్సిన పరుగులు భారీగా ఉండటంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఒంటరిగా నిలబడి అర్థసెంచరీ చేసాడు. ఆ తరువాత కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కాసేపు ప్రతిఘటించాడు. మిగతా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. చివరికి 19 ఓవర్లలో న్యూజీలాండ్ 159 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 96 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
4 వికెట్లతో బుమ్రా.. 3 వికెట్లతో అక్షర్ తాండవం
ఇషాన్ కిషన్ అద్భుత క్యాచ్.. వికెట్ తీసిన తర్వాత సంబరాలు చేసుకుంటున్న బుమ్రా, అక్షర్ పటేల్
తన పదునైన యార్కర్లు, స్లోబాల్స్తో కివీస్ బ్యాటర్లను గడగడలాడించిన జస్ప్రీత్ బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 4 వికెట్లు తీసుకుని న్యూజీలాండ్ చివరి వికెట్లను నేలకూల్చగా, మేటి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి అక్షర్ పటేల్ వారి పతనాన్ని శాసించాడు. అక్షర్.. డేంజరస్ ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్‌లను ఔట్ చేయగా, రచిన్ రవీంద్ర, కెప్టెన్ సాంట్నర్, నీషమ్, హెన్రీలను బుమ్రా బలి తీసుకున్నాడు. కాగా, హార్థిక్, వరుణ్, అభిషేక్ తలా ఒక వికెట్ పంచుకున్నారు. కాగా, బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్ మైదానంలో కూడా 3 అదిరిపోయే క్యాచ్‌లతో చెలరేగడం విశేషం.
భారత్‌కు శాంసన్ స్పెషల్.. పరుగుల ‘అభిషేకం’, ‘ఇషాన్’దార్..
న్యూజిలాండ్‌పై టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్
అంతకుముందు న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపడలేదు. తాము గెలిచినా, బ్యాటింగే చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించేవారమన్న సూర్య మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఈ టీ20 వరల్డ్‌కప్-2026 ఫైనల్‌లో టీమిండియా బ్యాటర్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను పరుగుల సునామీలో ముంచేసారు., భారత ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించారు. మొదటి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లపై దాడి ప్రారంభించిన సంజూ, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం శాంసన్ ఏమాత్రం వదలలేదు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసాడు. మరోవైపు అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి తనదైన శైలిని తిరిగిపొందిన అభిషేక్ 18 బంతుల్లోనే అర్థశతకం పూర్తిచేసి ఈ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీని నమోదు చేసాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అభిషేక్ అవుటైన తర్వాత వచ్చన ఇషాన్ కిషన్ కూడా అదే దూకుడు కొనసాగించాడు. సంజూ శాంసన్‌తో కలిసి రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కివీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయితే 16వ ఓవర్‌లో జేమ్స్ నీషమ్ వరుసగా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. శాంసన్, కిషన్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు ఒకే ఓవర్లో పడటంతో భారత వేగం కొంత మందగించింది.
చవరి ఓవర్లో దూబే ‘శివ’తాండవం
చివరి ఓవర్లలో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్‌లో ఐదు బౌండరీలు బాది 24 పరుగులు రాబట్టి భారత్ స్కోరును 255 పరుగులకు చేర్చాడు. న్యూజీలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు తీసుకోగా, మాట్ హెన్రీ, రచిన్ చెరో వికెట్ సాధించారు.
ఈ ప్రపంచకప్‌లో 3 సార్లు 250 పరుగులకు పైగా పరుగులు చేసిన ఒకేఒక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా సంజూ శాంసన్ ఎంపికయ్యారు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజూ ఖాతాలో అరుదైన రికార్డులు
ఫైనల్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరున నమోదు చేసుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 80.25 సగటుతో 321 పరుగులు చేసి అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.
👉 టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. తొలి ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు మహ్మద్ రిజ్వాన్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్ తలా మూడు సిక్సర్లు బాదారు.
👉 ఒకే టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 21 సిక్సర్లు కొట్టి ఫిన్ అలెన్ రికార్డును అధిగమించాడు.
👉 ఒకే టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. అతనికంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఘనత సాధించారు.
భారత జట్టు రికార్డులు
👉 భారత్ 3 సార్లు టి20 ప్రపంచ కప్ గెల్చుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది.
👉 వరుసగా 2 సార్లు ప్రపంచకప్ గెలిచిన భారత్
👉 ఒక టి20 సిరీస్‌లో 100కు పైగా సిక్సర్లు కొట్టిన ఒకే జట్టు భారత్
👉 ఆతిథ్య జట్టు కప్పు గెలవడం ఇదే తొలిసారి.
ఈ విజయంతో టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని చాటింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టు, కోట్లాది అభిమానులకు అపారమైన ఆనందాన్ని పంచింది. అహ్మదాబాద్ స్టేడియం అంతా భారత పతాకాలతో కళకళలాడగా, దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్, బుమ్రా-అక్షర్ పదునైన బౌలింగ్‌తో భారత్ మరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోనుంది.
