e-PAN Card | ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ఏమైనా మెయిల్స్ వచ్చాయి? అయితే జాగ్రత్త! హడావుడిలో ఆ మెయిల్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు శాఖ హెచ్చరించింది. ఇలాంటి నకిలీ మెయిల్స్‌ను నమ్మి మోసపోవద్దని సూచించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)తో కలిసి ఒక ఫ్యాక్ట్ చెక్ హెచ్చరికను జారీ చేసింది.
ప్రజలను మోసం చేసేందుకు e PAN కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని పలువురికి మెయిల్స్ వస్తున్నాయని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం తెలిపింది. అందులో ఈ పాన్‌కార్డు డౌన్‌లోడ్‌కు దశలవారీ సూచనలతో పలు లింక్‌లను ఇస్తున్నట్లు పేర్కొంది. అలా వచ్చిన మెయిల్స్ అన్నీ సైబర్ నేరగాళ్ల కుట్రలే అని చెప్పింది. ఈ మేరకు నకిలీ మెయిల్స్ స్క్రీన్‌షాట్‌లను ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేసింది. ఆర్థిక వివరాలు, సున్నితమైన సమాచారాన్ని దొంగలించేందుకు సైబర్ నేరగాళ్లు ఈ తరహా మెయిల్స్, లింకులు పంపిస్తుంటారని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం హెచ్చరించింది. ఆదాయపు పన్ను శాఖ పంపించే ఈ మెయిల్స్‌లో ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు, పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డు లేదా బ్యాంకు ఖాతాలు వంటి ఆర్థిక సమాచారాన్ని అడగబోదని స్పష్టం చేసింది.
అనుమానాస్పద ఈ మెయిల్స్ వస్తే వాటిని తెరవద్దని, వాటిలోని అటాచ్‌మెంట్లను అస్సలు క్లిక్ చేయవద్దని సూచించింది. ఆ అటాచ్‌మెంట్‌లో ప్రమాదకరమైన మాల్‌వేర్ ఉండే అవకాశం ఉందని తెలిపింది. పొరపాటున వాటిని క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది. ఒకవేళ ఇటువంటి ఫిషింగ్ మెయిల్స్ వస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఆదాయపు పన్ను శాఖ పేరుతో మెయిల్ వస్తే ఆ వివరాలను webmanager@incometax.gov.in మెయిల్‌కు, ఇతర సంస్థల పేరుతో వస్తే incident@cert-in.org.in వెబ్‌సైట్‌కు ఫార్వర్డ్ చేయాలని తెలిపింది. అనంతరం ఆ మెయిల్‌ను డిలీట్ చేయాలని సలహానిచ్చింది.
📢Have you also received an email asking you to download e-PAN Card❓#PIBFactCheck
⚠️This Email is #Fake
✅ Do not respond to any emails, links, calls & SMS asking you to share financial & sensitive information
➡ ️Details on reporting phishing E-mails:… pic.twitter.com/aGBodDQAPQ
— PIB Fact Check (@PIBFactCheck) March 8, 2026
