Pawan Kalyan | టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెరపై ఆయన నటన, డైలాగ్ డెలివరీ మాత్రమే కాదు… యాక్షన్ సన్నివేశాల్లో కనిపించే ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, గ్రేస్‌కి కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా, తనదైన ఆలోచనలు, వ్యక్తిత్వంతో పూర్తిగా భిన్నమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, తనకు అత్యంత ఇష్టమైన యుద్ధ కళల పట్ల ఉన్న ఆసక్తిని మాత్రం ఎప్పుడూ తగ్గించుకోలేదు.
సినిమాల్లోకి రాకముందే చెన్నైలో ఉన్న రోజుల నుంచే పవన్ కళ్యాణ్ కరాటే, కత్తిసాము, ఇతర మార్షల్ ఆర్ట్స్‌లో కఠిన శిక్షణ పొందారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ‘తమ్ముడు’, ‘ఖుషి’ వరకు, తాజాగా రాబోతున్న ‘ఓజీ’ వరకు ఆయన సినిమాల్లో కనిపించే యాక్షన్ సీక్వెన్స్‌లకు ఈ సాధనే పునాది. తెరపై సహజంగా కనిపించే ఫైట్స్ వెనుక దశాబ్దాల పాటు చేసిన సాధన దాగి ఉందని సినీ వర్గాలు చెబుతుంటాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ రంగంలో చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము విద్య అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఫిఫ్త్ డాన్’ గౌరవం లభించింది. జపాన్‌కు చెందిన అత్యంత గౌరవనీయమైన సంస్థ ‘సోగో బుడో కన్‌రి కై’ ఈ పురస్కారాన్ని అందజేయడం విశేషం. ఇది మూడు దశాబ్దాలకు పైగా ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో చూపిన అంకితభావానికి నిదర్శనంగా భావిస్తున్నారు.
ఇదే సందర్భంలో గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ పవన్ కళ్యాణ్‌కు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే ప్రత్యేక బిరుదును కూడా ప్రదానం చేసింది. అంతేకాదు, ‘సోకే మురమత్సు సెన్సై’ ఆధ్వర్యంలోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల్లో విపరీతమైన స్పందన కనిపిస్తోంది. గతంలో స్టంట్ కోఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఈ ప్రయాణంలో మరింత తోడ్పడిందని చెప్పొచ్చు.
సినిమాల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నటిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే, పెండింగ్‌లో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Come, witness the most memorable part of Shri Pawan Kalyan’s Martial Arts Journey.#PKMartialArtsJourney pic.twitter.com/Z3D27hD2Uh
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 11, 2026
