Eesha Review: Sound Over Substance in This Telugu Horror Attempt
(విధాత వినోదం డెస్క్)
Eesha Review | హారర్ సినిమాలపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిన తాజా చిత్రం ‘ఈషా’ (Eesha). ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి చిత్రాల తర్వాత బన్నీ వాస్–వంశీ నందిపాటి సమర్పణలో వచ్చిన ఈ సినిమా, దయ్యాలు, ఆత్మలు నిజంగానే ఉన్నాయా? అనే ప్రశ్న చుట్టూ తిరిగే హారర్ థ్రిల్లర్. ప్రమోషన్లలో “సున్నిత మనస్కులు చూడొద్దు” అంటూ నిర్మాతలు చేసిన హెచ్చరికలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ స్థాయిలో ‘ఈషా’ ప్రేక్షకులను భయపెట్టిందా? అన్నదే ఇప్పుడు పరిశీలిద్దాం.
కథ & కథనం.. భయానకమేనా?
కల్యాణ్ (త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దయ్యాలు, ఆత్మలు లేవని గట్టిగా నమ్మే వీరు, మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేసే దొంగ బాబాల గుట్టు బయటపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంటారు. ఈ క్రమంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఆశ్రమం పెట్టుకొని, దయ్యాలను వదిలిస్తానంటూ పేరుగాంచిన ఆదిదేవ్ బాబా (పృథ్వీరాజ్) గురించి తెలుసుకుంటారు.
ఆత్మలు నిజంగానే ఉన్నాయనే విషయం నిరూపిస్తానంటూ ఆదిదేవ్ విసిరిన సవాల్‌కు స్పందించిన ఈ నలుగురు, మూడు రోజుల పాటు ఓ పాడుబడ్డ బంగ్లాలో ఉండేందుకు సిద్ధమవుతారు. ఆ బంగ్లాలో వారికి ఎదురయ్యే అనుభవాలు, పుణ్యవతి అనే ఆత్మ వెనుక ఉన్న కథ, ఆదిదేవ్ బాబా అసలు నేపథ్యం ఏమిటి? అన్నదే కథ.
కథా మూలం కొత్తదేమీ కాదు. దయ్యాలు లేవని నమ్మే పాత్రలు, పాడుబడ్డ భవంతి, అక్కడ వరుస భయానక సంఘటనలు – ఇవన్నీ ఈ హారర్ జానర్‌లో ఇప్పటికే చూసినవే. తొలి సగం మొత్తం నెమ్మదిగా సాగుతూ, కథలో పెద్దగా మలుపులు లేకుండా ముందుకెళ్తుంది. ఇంటర్వెల్ దగ్గర కొంత ఉత్కంఠ పెరిగినా, ఆ తర్వాత ద్వితీయార్థంలో కూడా అదే రొటీన్ ఫార్ములా కొనసాగుతుంది. పుణ్యవతి ఆత్మకు సంబంధించిన ఎపిసోడ్లో భయపెట్టే అవకాశమున్నా, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అలాగే ఆదిదేవ్ బాబా ఫ్లాష్‌బ్యాక్‌ను స్పష్టంగా చూపించకపోవడం కథనానికి మైనస్ అయ్యింది. అయితే, అకస్మాత్తుగా మరణించిన వాళ్లు ఆత్మలుగా ఎందుకు మారతారు? అనే పాయింట్‌తో సాగే క్లైమాక్స్ మాత్రం కొంత థ్రిల్‌ను పంచుతుంది. చివర్లో సీక్వెల్‌కు కూడా సంకేతం ఇవ్వడం గమనార్హం.
నటీనటులు & సాంకేతిక విభాగం పనితీరు పరవాలేదు
నటీనటుల పరంగా త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. అయితే పాత్రల లోతు తక్కువగా ఉండటంతో, వారి నటన పూర్తిగా ప్రభావం చూపలేకపోయింది. ఆదిదేవ్ బాబాగా పృథ్వీరాజ్ గెటప్ పరంగా కొత్తగా కనిపించినా, ఆ పాత్రను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం కనిపిస్తుంది. పుణ్యవతి ఆత్మ ఆవహించిన వ్యక్తిగా మైమ్ మధు మాత్రం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆయన గెటప్, నటన రెండూ భయాన్ని కలిగిస్తాయి.
సాంకేతికంగా సినిమాకు నేపథ్య సంగీతమే ప్రధాన బలం. ఆర్.ఆర్. ధృవన్ నేపథ్యసంగీతం అనేక చోట్ల భయానక వాతావరణాన్ని సృష్టించింది. దృశ్యాలు అక్కడక్కడా భయాన్ని కలిగించేట్లు ఉన్నా, మేకర్స్ ఇచ్చిన హెచ్చరిక మేరకు అయితే లేవు. కథ–స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటంతో, సాంకేతిక విలువలు పూర్తిగా ఉపయోగపడలేదు. నిర్మాణ విలువలు మాత్రం కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
‘ఈషా’ కొత్తదనమేమీ లేని, రొటీన్ హారర్ థ్రిల్లర్. కొన్ని చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉన్నా, కథనం మొత్తంగా ఆశించిన స్థాయిలో ఉత్కంఠను రేపలేకపోయింది. బిగువైన రచన, పాత్రల్లో గాఢత లేకపోవడం వల్ల సినిమా ప్రభావం తగ్గింది. హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు గానీ, భారీ అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.
విధాత రేటింగ్: 2.5 / 5
