Mega 158 Update: Mohanlal to Join Chiranjeevi, Young Actress as Daughter?
(విధాత వినోదం డెస్క్)
MEGA 158 | మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి రాబోతున్న చిత్రానంతరం, దర్శకుడు బాబీ కొల్లితో ఆయన రెండోసారి కలయికలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాత్కాలికంగా MEGA 158 / #ChiruBobby2 అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారం పొందుతున్న ఈ సినిమా, ‘వాల్తేరు వీరయ్య తర్వాత చిరు–బాబీ కాంబోలో వస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ఆసక్తికరమైన కథనాలు అభిమానుల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేస్తున్నాయి.
మోహన్‌లాల్ కీలక పాత్ర? చిరంజీవికి కూతురిగా కొత్త హీరోయిన్ టాక్
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం కొంతకాలంగా ఉంది. తొలుత తమిళ స్టార్ కార్తీ పేరు వినిపించగా, తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ Mohanlal ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, చిరంజీవి–మోహన్‌లాల్‌లు తొలిసారిగా ఒకే తెరపై కనిపించబోతుండటం సినీ అభిమానులకు నిజంగా పెద్ద కంటి పండుగే. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపించగా, మోహన్‌లాల్ మధ్య భాగంలో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. కాగా, ఇదే అంశంపై విధాత గతంలోనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మోహన్‌లాల్ చిరంజీవి సినిమాలో భాగం కానున్నారని అప్పుడే వెల్లడించింది.
కథాపరంగా చిరంజీవి తండ్రి పాత్రలో కనిపించనున్నారని, ఆయన కుమార్తె పాత్ర కోసం ఒక యంగ్, అప్‌కమింగ్ హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరనే దానిపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత రాకపోయినా, నటీనటవర్గం చుట్టూ ఆసక్తి మాత్రం గట్టిగానే నెలకొంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్ దర్శకుడు–నటుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు కూడా గత కొద్ది రోజులుగా ఊపందుకున్నాయి.
రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా MEGA 158
బాబీ ఈసారి తాను ఇప్పటివరకు కలిసి పని చేయని టెక్నీషియన్స్‌ను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. మాలీవుడ్ టాప్ డీఓపీ నిమిష్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనుండగా, ఈసారి సంగీత దర్శకుడిని కూడా మారుస్తున్నారు. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా కొత్త తరహా సంగీతాన్ని అందించే మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంపిక చేసే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.
రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, బాబీ ప్రజెంటేషన్‌లో మెగాస్టార్ మాస్ హిస్టీరియాను మరో స్థాయికి తీసుకెళ్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
