విధాత, హైదరాబాద్ : నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాద ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంటల్లో కాలిపోయిన ఫోరెన్సిక్ ఆధారాలు ఎంతమేరకు కాలిపోయాయన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినప్పటికి..ఘటన పై ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ఉన్నతాధికారులు చేస్తున్న ప్రకటనలు ఓ వైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలు మరోవైపు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సెగలు రేపుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో రాష్ట్రంలో సంచలనం రేపిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎదుర్కొన్న ఓటుకు నోటు ఏసీబీ కేసు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఎదుర్కొంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు ధగ్ధమయ్యాయన్న అనుమానాలు అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చకు కారణంగా మారాయి.
అనుమానించిందే నిజమైంది : బీఆర్ఎస్
నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటుతో సహా కీలక కేసుల ఆధారాలు దగ్ధమయ్యాయని..దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగి ఉందంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు సంధించారు. ఇందుకు ప్రమాదంపై ఎఫ్ ఎస్ ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన ఫిర్యాదు నిదర్శనమని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మొత్తం ఐదు రూమ్స్‌లోని కీలకమైన ఫైల్స్ కాలిపోయాయని, సర్వర్ రూమ్, కంప్యూటర్ ఫోరెన్సిక్ లాబరేటరీ, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలసిస్ ఛాంబర్‌లోని ఫైల్స్ బూడిదయ్యాయంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
పోలీసు ఫిర్యాదులో కీలక అంశాలు
ఎఫ్ఎస్ఎల్ ఇన్‌స్పెక్టర్ శ్రీవాస్‌రెడ్డి ఫిర్యాదులో మొదట ప్రాపర్టీ రూమ్‌లో భారీగా నల్ల పొగతో కూడిన మంటలు వ్యాపించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మంటలు ఇతర గదులకి వ్యాపించాయని తెలిపారు. శనివారం ఉదయం 10.08 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో వెల్లడించారు. ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి శ్రీ సాయి కృష్ణ ప్రమాదంపై సమాచారం ఇచ్చారని, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేసు వెరిఫికేషన్ ఛాంబర్, సర్వర్ రూమ్, అనాలసిస్ ఛాంబర్, హెచ్ఆర్డీ హాల్‌తో పాటు ఫర్నిచర్ పరికరాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని ఫిర్యాదు చేశారు. జీరోఎఫ్ఐఆర్ ఫైర్ యాక్సిడెంట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ఫైర్ అక్సిడెంట్ కింద దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ సైతం అదే విమర్శల దాడి
అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై వారి సాగించిన అవినీతి, అక్రమాల కేసుల నుంచి పరస్పరం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే గతంలో సచివాలయంలో అగ్నిప్రమాదం..ఇప్పుడు ఎఫ్ ఎస్ ఎల్ ల్యాబ్ లో అగ్నిప్రమాదాలు జరిగాయని ఆరోపించారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక ఆధారాలు ధ్వంసమైనట్లేనంటూ కీలక ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ ఎస్ ఎల్ అగ్ని ప్రమాదం కుట్ర ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు.
కుట్ర చేసే అవసరం మీకే ఉంది : కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ముడి పెట్టడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనలో ఏదైనా కుట్ర ఉంటే అది మీ తరపు నుంచే జరిగి ఉండాలని కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు ఉన్నందునా కుట్ర చేసే అవసరం మీకే ఉందని..అందుకేనా ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు అని చామల ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ దుష్ప్రచారానికి దిగారని విమర్శించారు. గత బీఆర్ఎస్ పదేళ్ల దరిద్రపు పాలనను మర్చిపోయి ప్రజలు మీకు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేస్తారని ఎలా అనుకుంటున్నారని మండిపడ్డారు.
అదంతా దుష్ప్రచారం: పోలీస్ శాఖ
అయితే ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖా గోయల్ మాత్రం అగ్ని ప్రమాదంలో ప్రధాన కేసులుగా ఉన్న ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు ఏవి ధగ్ధం కాలేదంటూ ప్రకటించడం..డీజీపీ శివధర్ రెడ్డి సైతం ఎలాంటి ఎవిడెన్స్ డామేజ్ జరుగలేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రమాద ఘటనపై ప్రెస్‌నోట్ సైతం అధికారులు విడుదల చేశారు. పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెడుతామని శిఖా గోయల్ ప్రకటించారు.
ఎఫ్ఎస్ ఎల్ అగ్ని ప్రమాదం తర్వాత రెండు ముఖ్యమైన కేసుల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని డీజీ శిఖా గోయల్ మీడియాకు వివరణ ఇచ్చారు. వాటిలోని మెుదటి కేసు.. ఏసీబీ కేసు 2015లో 16 ఐటమ్స్ ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు అని, దానికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ 2015లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ తిరిగి పంపించింది అని, ఆ కేసుకు సంబంధించిన అన్ని మెటీరియల్స్ 2021లో కోర్టుకు సమ్మిట్ చేశామని, ఆ కేసుకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ లో లేదు అని తెలిపారు.
రెండో కేసు పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 నుంచి 2026 వరకు 136 ఐటమ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు అని, ఇందులో 129 ఐటమ్స్ ఎనాలసిస్ చేసి రిపోర్ట్స్ ని సంబంధించిన దర్యాప్తు సంస్థకు పంపించాం అని, ఏడు రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంది అని తెలిపారు. దగ్ధమైన ప్రాపర్టీకి సంబంధించి విచారణ చేస్తున్నామని, అందులో ఉన్న సమాచారాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్ తో మళ్లీ రీట్రేవ్ చేయవచ్చని, ఎటువంటి ఆధారాలు మిస్ అయ్యే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదంలో ఆధారాలన్ని దగ్ధమైనట్లుగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మ వద్దు అని కోరారు. సీజ్ చేసిన ప్రాపర్టీ కొంతమేర మాత్రమే కాలిపోయిందని వెల్లడించారు.
మొత్తం మీద ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెలరేగిన అగ్ని ప్రమాదం మంటలు చల్లారిపోయినా…ఈ ఘటనతో అధికార, ప్రతిపక్షాల మధ్య రేగిన రాజకీయ ఆరోపణలు మంటలు మాత్రం రోజురోజుకు ప్రజ్వరిల్లుతుండటం ఆసక్తికరంగా మారింది.
