Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందని, ఇందులో పవన్ కళ్యాణ్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ టాక్.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. ఉగాది పండుగ రోజు ఈ చిత్రానికి గ్రాండ్ ఓపెనింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాను 2027 సంక్రాంతి బరిలో విడుదల చేయాలన్న లక్ష్యంతో నిర్మాత–దర్శకులు ముందుకు వెళ్తున్నారట. జనవరి 12, 2027ను టార్గెట్ రిలీజ్ డేట్‌గా భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కు చెప్పగా “మీ ఇష్టం” అన్నట్టుగా సమాధానం ఇచ్చారని ప్రచారం.
అయితే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్‌పై మాత్రం కొంత అనిశ్చితి నెలకొంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు పరిమిత డేట్స్ మాత్రమే కేటాయించే అవకాశం ఉందన్నది ప్రధాన సందేహం. ఉగాది ఓపెనింగ్ అనంతరం ఆయన డేట్స్ ఇస్తారని, అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా నాటికి షూటింగ్ పూర్తి చేసి, తర్వాత పోస్ట్–ప్రొడక్షన్ పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్రణాళికగా తెలుస్తోంది.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన “గోపాల గోపాల”, “అజ్ఞాతవాసి” సినిమాలు కూడా సంక్రాంతి సీజన్‌లోనే విడుదలయ్యాయి. అందులో “గోపాల గోపాల” సగటు విజయాన్ని సాధించగా, “అజ్ఞాతవాసి” నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ హిట్ కొడతారా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా, పవన్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రం మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక 2027 సంక్రాంతి పోటీ కూడా గట్టిగానే ఉండబోతోంది. ఇప్పటికే చిరంజీవి–అనిల్ రావిపూడి కాంబినేషన్ చిత్రం, శర్వానంద్ ప్రాజెక్ట్, రజనీకాంత్ మూవీతో పాటు నాగవంశీ నిర్మాణంలో మరో భారీ సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ భారీ పోటీలో చివరకు ఎవరు వెనక్కి తగ్గుతారు? ఎవరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడతాయి? అన్నది అప్పటివరకు ఆసక్తికరంగానే మారింది.
