CM Revanth Reddy | ఉన్న జిల్లాలు తొలగించం… కొత్తవి ఏర్పాటు చేయం: సీఎం రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేసే ప్రసక్తి లేదని, అదే సమయంలో పాత జిల్లాలను యథాతథంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

revanth-districts-decision

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
CM Revanth Reddy | రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలను తొలగించేది లేదని, అదే సమయంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు ఉన్న జిల్లాలను ప్రభుత్వం తొలగిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిది ఏమీ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భూపాల్ పల్లి జిల్లా చెల్పూరులో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా లబ్దిపొందేందుకు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు భూపాలపల్లి జిల్లాను తొలగిస్తారని ప్రచారం చేస్తున్నారని, భూపాలపల్లి జిల్లాయే కాదు ప్రస్తుతం ఉన్న ఏ జిల్లాను తొలగించేది లేదని, కొత్త జిల్లాలను ఇచ్చేది లేదని నొక్కి చెప్పారు. జిల్లాల మార్పులు చేర్పులకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటే, ఈ అంశం గురించి రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి విపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి వివరించారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, చేపట్టిన అభివృద్ధిని ఈ సందర్భంగా వివరించారు. మట్టిపనికైనా ఇంటోడే కావాలని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పనులు చేయించుకునే మనొళ్ళను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వమని మీరు ఆశీర్వదిస్తే మోడీ, కేసీఆర్ తో సహా ఎవరు వచ్చినా మాకేం కాదన్నారు.

రెండేళ్ళలో మున్సిపాలిటీలకు రూ.17442 కోట్లు

రెండేళ్ళలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.17442 కోట్లు కేటాయించిందని సీఎం రేవంత్ చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకే రూ. 6116 కోట్లు కేటాయించామన్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీనిర్మాణానికి. గ్రేటర్ వరంగల్ కు రూ. 5287 కోట్లు, భూపాలపల్లికి 92 కోట్లు, పరకాలకు రూ.52 కోట్లు, జనగామకు రూ82 కోట్లు , స్టేషన్ ఘన్ పూర్ కు రూ.50 కోట్లు, మహబూబాబాద్ కు రూ.121 కోట్లు, డోర్నకల్ కు రూ.49 కోట్లు, మరిపెడకు రూ. 51 కోట్లు, తొర్రూరుకు రూ.51 కోట్లు, కేసముద్రానికి రూ.21 కోట్లు, ములుగుకు రూ.15 కోట్లు, నర్సంపేటకు రూ.149 కోట్లు, వర్ధన్నపేటకు రూ.52 కోట్లు కేటాయించామని సీఎం ప్రకటించారు.

బాసర నుంచి భద్రాచలం వరకు అభివృద్ధి

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని దేవాలయాలను పర్యాటక ప్రాంతాలలో అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. అవసరమైతే దీని కోసం రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టుల నిర్మాణం చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో కాళేశ్వరం, కొడవటంచ నర్సింహాస్వామి దేవాలయం, సమ్మక్క,సారలమ్మ దేవాలయాలుంటాయన్నారు. మేడారం జాతరను విజయంతం చేశామని సీఎం చెప్పారు. ఈ జాతరకు రెండు కోట్ల మంది భక్తులు వచ్చారని, వెయ్యేండ్లు ఉండే విధంగా మేడారంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మేడారం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను విజయవంతం చేశామని, రాబోయే గోదావరి పుష్కరాలను కూడా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు.

సింగరేణి సమస్యలు తీరుస్తాం

భూపాల్ పల్లి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. సింగరేణి కార్మికుల సమస్యలపై కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డిస్మిస్డ్ కార్మికుల సమస్యలు, మెడికల్ బోర్డుతో పాటు సింగరేణి అంశాలను పరిశీలించి సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్తెన్న తనకు అన్ని వివరాలు చెప్పారని వాటిని తీరుస్తామన్నారు. నమ్మకం ఉన్న గండ్ర ఈయన అయితే నమ్మితే మోసం చేసే గండ్ర ఆయన అంటూ బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి పై సెటైర్లు వేశారు.

పేదల ఇండ్లు మరిచి, ఫాంహౌజులు కట్టుకున్నారు

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించడం విస్మరించారని, వాళ్లు మాత్రం వందల ఎకరాలలో ఫాం హౌజ్ లు కట్టుకున్నారంటూ సీఎం విరుచుకపడ్డారు. ఎర్రవెల్లిలో కేసీఆర్, జన్వాడలో కేటీఆర్, మోయినాబాద్ లో హరీష్ రావు, సంతోష్ రావు, కవితలు వేలు, వందల ఎకరాల్లో ఫాం హౌజ్లు కట్టుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని కూళేశ్వరంగా మార్చివేసి కోట్లుదండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని, ఏప్రిల్ తర్వాత అదనంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు.

కేసీఆర్, హరీష్, కేటీఆర్ల కాపాడుతోందే కిషన్ రెడ్డి

కాళేశ్వరం కుంభకోణంలో సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావులపై కేసు పెట్టి, అరెస్టుచేయకుండా, కార్ల రేస్ లో కేటీఆర్ ను ఈడీ విచారించకుండా అడ్డుకుంటుంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటూ సీఎం విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నందున పట్టించుకోవడంలేదన్నారు. తమ పార్టీ అగ్రనేతలు సోనియా, రాజీవ్లను విచారించేందుకు సిద్ధమైన సీబీఐ,ఈడీ బీఆర్ఎస్ నాయకుల అంశంలో ఎందుకు స్పందించడంలేదని ఆగ్రహించారు. పైగా తాను అరెస్టుచేయడంలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. కిషన్ రెడ్డి ఇప్పటి నుంచి కల్వకుంట్ల కిషన్ రావేనంటూ మరోసారి తేల్చిచెప్పారు. భార్యభర్తలు, జడ్జీలు, జర్నలిస్టులు, సినీతారలు, పారిశ్రామిక వేత్తల ఫోన్లు విని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు దండుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కాదని బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అంటూ విమర్శించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. ఈ సభల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, మంత్రులు పొంగులేటి, శ్రీధర్బాబు, కొండా సురేఖ, ఎంపీ కావ్య, నాయకులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. దీనికి ముందు కొడవటంచ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి, అభివృద్ధి పనులు ప్రారంభించారు.

Latest News