Telangana Municipal Elections| మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఈసీ మార్గదర్శకాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్ పోలింగ్ ఈ నెల 11న కొనసాగనుంది. 13వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. అనంతరం 16వ తేదీన రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్‌‌‌‌, 116 మున్సిపాలిటీల్లో చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌, డిప్యూటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ నియామకానికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి.

పరోక్ష పద్దతిలో జరిగే ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీడీఎంఏతో పాటు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మేయర్లు, చైర్ పర్సన్ల ఎన్నిక నిర్వహణ స్పెషల్ మీటింగ్ ముందే ఎన్నికకు అవసరమైన పత్రాలను మున్సిపల్ కమిషనర్ల దగ్గర నుండి తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. మేయర్, డిప్యూటీ మేయర్‌‌‌‌, మున్సిపాలిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌, డిప్యూటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ ఎన్నికలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు లోక్‌‌‌‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఎక్స్‌‌‌‌అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. ఎక్స్ అఫిషియో సభ్యులను ఈ నెల 14 లోపు ఆయా జిల్లాల కలెక్టర్లు ఫైనల్‌‌‌‌ చేయనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ తీయనున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకే విప్ జారీ చేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్‌‌‌‌అఫీషియో సభ్యులంతా విప్‌‌‌‌ ప్రకారమే ఓట్లు వేయాల్సి ఉంటుంది.చేతులెత్తే పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో విప్ పాటించడం ఆయా పార్టీల సభ్యులకు తప్పనిసరి. విప్‌‌‌‌ను ఉల్లంఘించి ఓటు వేసినా, ఓటింగ్‌‌‌‌కు దూరంగా ఉన్నా వారు సభ్యత్వాన్ని కోల్పోతారు’ అంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా సభ్యుడు విప్‌‌‌‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా దానిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే అతడు సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News