Revanth Reddy| నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

నేనే రాజు, నేనే మంత్రి అని నేను మాట్లాడిన మాటలను వేరే విధంగా అర్థం చేసుకున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నేనే, మున్సిపల్ మంత్రి నేనే అయినందునా మున్సిపల్ ఎన్నికల పలితాలకు నాదే బాధ్యత..నా పనితీరుకు గీటురాయి అని చెప్పే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేశానన్నారు.

Revanth Reddy| నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

విధాత : నేనే రాజు, నేనే మంత్రి అని నేను మాట్లాడిన మాటలను వేరే విధంగా అర్థం చేసుకున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నేనే, మున్సిపల్ మంత్రి నేనే అయినందునా మున్సిపల్ ఎన్నికల పలితాలకు నాదే బాధ్యత..నా పనితీరుకు గీటురాయి అని చెప్పే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. మున్సిపల్ ఎన్నికల పలితాలను దృష్టిలో ఉంచుకొనే నేనే రాజు,నేనే మంత్రి అని చెప్పానని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పార్టీకి 85 నుంచి 90 శాతం పలితాలు వచ్చాయన్నారు. దీంతో నేను విర్రవీగనని.. గెలిస్తే పొంగిపోవడం,ఓడితే కుంగిపోవడం లేదు అని,  మరో 20 ఏళ్ళు నేనే పేదల కోసమే పని చేస్తానని, సేవ చేయాలన్నదే నా ఉద్దేశ్యం అన్నారు.  సంత్ సేవాలాల్ జ‌యంతి స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి  మాట్లాడారు. మేం పాల‌కులం కాదు మేం సేవ‌కులం అని నేను ఏ నాడో చెప్పాను..నేను పాల‌కుడి గా ఎప్పుడు ప్ర‌వ‌ర్తించ‌లేదు..సేవ‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న‌ానన్నారు. సేవ చేయ‌డానికే ప్ర‌జ‌లు నాకు అవ‌కాశం ఇచ్చారు..ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటా..ఏ వ‌ర్గాలైతే నాకు అవ‌కాశం ఇచ్చారో వాళ్ల‌కు సేవ చేయాల‌న్న‌దే నా ప్ర‌య‌త్నం.. 40 ఏళ్ల నుంచి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ జ‌ఠిలం అయితే నేను ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాను అని గుర్తు చేశారు.

నల్లమలలో పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రంగా సంత్ సేవాలాల్ క్షేత్రం

మానవ జాతి శాంతి మార్గంలో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తిని నిప్పారు అని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా నిలబడ్డారని, సేవాలాల్ జయంతి అధికారికంగా జరపడం మా బాధ్యత అన్నారు. తెలంగాణ ఉద్యమం లో లంబాడీలు కీలక పాత్ర పోషించారు అని, సురేష్ నాయక్,కవిత నాయక్ ఆత్మ బలిదానం చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో దళితులతో పాటు గిరిజనలు ప్రాధాన్యత ఉండాలి అని, నల్లమలలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం కోసం 20 ఎకరాల భూమి కేటాయించాం అని, ప్రపంచంలోనే గొప్ప గిరిజన క్షేత్రంగా తీర్చిదిద్దుతామని, వచ్చే జయంతి అక్కడే జరుపుకుందాం అన్నారు. గిరిజన సంప్రదాయాలు దెబ్బతినకుండా నిర్మాణాలు ఉంటాయి అని తెలిపారు.

అన్ని తండాలకు బీటీ రోడ్లు

మిడ్జిల్ లో నేను జడ్పీటీసీగా అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తండాల్లో ఉన్న యువకులు నా విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారని, అలాగే నా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రతి సందర్భం లో లంబాడా సోదరులు అండగా నిలబడ్డారు అని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. నాకు సీఎం హోదా రావడానికి లంబాడాల అండ దండలు ఉన్నాయన్నారు. ఈ వర్గాలకు సముచిత గౌరవం మా ప్రభుత్వం ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్ లు వేయాలని ఈ సందర్బంగా ఆదేశాలు ఇస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి తండాలో అన్ని సదుపాయాలు ఉండాలని, ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని, అన్ని తండాలలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలని, తాగునీటి కోసం ట్యాంకులు ఏర్పాటు చేయాలని, సోలార్ పంప్ సెట్ లు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయాలని ఇందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్లుగా తెలిపారు.

పాలనలో వెనుకబడిన వర్గాలకు భాగస్వామ్యం

సమాజంలో వెనుకబడిన వర్గాలను భాగస్వామ్యం చేయాలన్నదే నా ఆలోచన అని, ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాం అని, ఎస్సీ జనాభా 15 శాతం ఉంటే 30 శాతం పదవులు ఇచ్చాం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నలుగురు మంత్రులు,స్పీకర్ పదవి ఎస్సీ వర్గానికి ఇచ్చాం అని, సమాజంలో వస్తున్న మార్పు ను గుర్తిస్తున్నారని, అందుకే కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజలు తీర్పునిస్తున్నారన్నారు. కొంత మంది మేము పాలించ డానికే పుట్టాం అని భావిస్తున్నారంటూ పరోక్షంగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథ ద్వారా చాలా తండాల్లో మంచి నీటి సౌకర్యం కల్పించ లేదు అన్నారు.  గత పాలకులు దళితుడికి చేతకాదని చెప్పి వారే ముఖ్యమంత్రి అయ్యారని..నేడు మా ప్రజాపాలనలో స్పీకర్ గా ఉన్న దళితుడిని మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరే పరిస్థితిని కల్పించామన్నారు.

భూములు లేవు.. నాణ్యమైన విద్య అందిస్తాం

ఇందిరా గాంధీ ఎస్టీ లకు రిజర్వేషన్లు ఇచ్చారు అని, అసైన్డ్ పట్టాల రూపంలో గిరిజనలకు భూములు ఇచ్చారని.. ఈ రోజుల్లో  ప్రభుత్వం దగ్గర ఇవ్వడానికి  భూములు లేవు అని, నాణ్యమైన విద్య ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉంది అని రేవంత్ రెడ్డి చెప్పారు.  గిరిజన విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం కోసమే ఆ వర్గానికి చెందిన అధికారులకు మంచి పోస్ట్ లు ఇచ్చానని, నిర్దిష్టమైన ప్రణాళికతో చదువుకోవాలన్నారు. 100 నియోజక వర్గాల్లో 20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నాం అని, హాస్టల్స్ లో మెస్ చార్జీలు,కాస్మొటిక్స్ చార్జీలు పెంచాం అని తెలిపారు. చదువు లేక పోవడం వల్లనే పేదరికంలో మిగిలిపోతున్నారని, చదువే అన్ని హోదాలు తెచ్చి పెడుతుంది అని, చదువు కుంటే సమాజానికి ఉపయోగపడతారు అని, గిరిజన విద్యార్థులు మీ చదువుకు ఏం కావాలో నాకు చెప్పండని సూచించారు.

రెండేళ్లలో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

రేండేళ్ల కాంగ్రెస్ పాలనలో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్ 1పైన అక్రమ కేసు వేస్తే కోర్టుకుకు వెళ్లి పోరాడి పలితాలు ప్రకటించాం అని, గ్రూప్ 1లో 87 శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కాయన్నారు. పేదవాడి గౌరవం రేషన్ కార్డు అని, రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం అని తెలిపారు. 3.15 కోట్ల మంది పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అని, నేను స్వయంగా ఒక గిరిజనుడి ఇంటికి వెళ్లి సన్న బియ్యం తో భోజనం చేశానన్నారు. పేదల ఇళ్ళకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని, 50 లక్షల పేదల ఇళ్ల లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని, రెండేళ్లలో 9000 కోట్ల రూపాయలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టాం అని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 1000 కోట్లతో సోలార్ విద్యుత్ ప్లాట్ లు ఏర్పాటు చేయిస్తున్నాం.. ఇందులో గిరిజన మహిళలు లబ్ది పొందుతున్నారని పేర్కొన్నారు.