Bone-02 glue | చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జెజియాంగ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న Sir Run Run Shaw Hospital కి చెందిన అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షియన్‌ఫెంగ్, ఆయన బృందం ఎముకల వైద్యంలో విప్లవాత్మకమైన ముందడుగు వేసారు. వారు అభివృద్ధి చేసిన “బోన్-02” (Bone-02) జిగురు మూడు నిమిషాల్లో విరిగిన ఎముకలను అతికించగలదని ప్రకటించారు.
సాంప్రదాయ ఎముకల వైద్యంలో ఎముక విరిగితే డాక్టర్లు శరీరాన్ని పెద్దగా కోసి, లోహపు ప్లేట్లు, స్క్రూలతో ఎముకను సెట్ చేసి కట్టు వేసేవారు. ఆపరేషన్‌కు కూడా గంటల సమయం పట్టేది. రోగికి రక్తస్రావం, నొప్పి, రెండోసారి ఆపరేషన్ చేసి ఆ ఇంప్లాంట్లు తీసేయాల్సిన పరిస్థితులు ఉండేవి. గ్లోబల్‌టైమ్స్ కథనం ప్రకారం, డాక్టర్ లిన్ ఒక రోజు సముద్రంలో రాళ్లకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పల(Oysters)ను గమనించారు. నీటి తడిలో, ఉప్పులో కూడా అవి గట్టిగా అతుక్కుపోయి ఉండడం ఆయనకు ప్రేరణ ఇచ్చింది. అదే సూత్రాన్ని వైద్యరంగంలోకి తీసుకువచ్చి, ఎముకలకు ఉపయోగించే జిగురును తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన 2016లో మొదలై, దాదాపు తొమ్మిదేళ్ల పరిశోధన తర్వాత “బోన్-02” గ్లూగా రూపుదిద్దుకుంది.
ఈ గ్లూ ఒకే ఇంజెక్షన్‌తో విరిగిన ఎముక ముక్కలను కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లో గట్టిగా అతికిస్తుంది. నీటిలో నివసించే అల్చిప్పలు రాళ్లకు అతుక్కునే టెక్నిక్‌ను అనుకరించడంతో, రక్తం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా పని చేస్తుంది.
అత్యద్భుతమైన ఫలితాలు – భవిష్యత్తు శస్త్రచికిత్సలో పెనుమార్పు
“బోన్-02” గ్లూ ప్రయోగశాల పరీక్షల్లోనే కాదు, వందలాది రోగులపై వాస్తవ శస్త్రచికిత్సల్లో కూడా అద్భుత ఫలితాలు ఇచ్చింది. ఇప్పటివరకు 150 మందికి పైగా రోగులపై విజయవంతంగా పరీక్షించినట్లు సిసిటివి తెలిపింది. ముఖ్యంగా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయే ఫ్రాక్చర్స్లో ఈ గ్లూ మంచి ఫలితాలు ఇచ్చింది. షాబ్సర్వర్ తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ లిన్ ఈ జిగురు విజయం తెలియజేయడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ జిగురు పరీక్షా ఫలితాలు:
ఈ సంఖ్యలు సాధారణ మెటల్ ఇంప్లాంట్ల బలానికి సాటిరావడమే కాకుండా, రోగులకు సురక్షితమైన పరిష్కారం అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గ్లూ శరీరంలో క్రమంగా కరిగిపోతుంది. అంటే, రెండోసారి ఆపరేషన్ చేసి లోహపు ప్లేట్లు తీసేయాల్సిన అవసరం ఉండదు. రోగి చాలా తక్కువ సమయంలో కోలుకుంటాడు. ఇంకా పెద్ద లాభం ఏంటంటే, ఈ గ్లూ వాడితే ఆపరేషన్ రంధ్రం చాలా చిన్నగా ఉంటుంది. తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, తక్కువ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటాయి. శస్త్రచికిత్స సమయం గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోతుంది.
ఇక ప్లేట్లకు, స్క్రూలకు చెల్లుచీటి
వైద్య నిపుణులు చెబుతున్నట్లుగా, ఈ జిగురు అత్యవసర పరిస్థితుల్లో (యుద్ధాలు, రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు వంటి విపత్తులు) రోగులకు తక్షణ చికిత్స అందించడంలో చాలా ఉపయోగపడుతుంది. కొన్ని నిమిషాల్లోనే ఎముకలు అతికిపోవడం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం కూడా పెరుగుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బోన్ సిమెంట్లు, ఫిల్లర్లు నిజమైన అతికింపు (adhesive) గుణం కలిగివి కావు. 1940ల్లో గ్లూ ప్రయత్నాలు జరగినా, అవి శరీరానికి తగిన విధంగా పని చేయకపోవడంతో విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు చైనా శాస్త్రవేత్తల ఈ “బోన్-02” గ్లూ, ఏడు దశాబ్దాల తర్వాత కావాల్సిన పరిష్కారాన్ని అందించింది.
చైనా వైద్యుల “బోన్-02” గ్లూ ఆవిష్కరణ వైద్యరంగానికి ఒక కొత్త దిశను చూపించింది. మూడు నిమిషాల్లోనే ఎముకలు అతికించగల ఈ జిగురు భవిష్యత్తులో సాంప్రదాయ లోహపు ఇంప్లాంట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. శస్త్రచికిత్స సమయం తగ్గిపోవడం, రోగికి తక్కువ ఇబ్బందులు, రెండో ఆపరేషన్ అవసరం లేకపోవడం వంటి ప్రయోజనాలతో ఇది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.