డయాబెటిస్ అనగానే మనకు గుర్తొచ్చే రకాలు రెండే.. టైప్ 1, టైప్ 2. కానీ ఇప్పుడు వైద్య శాస్త్రం మరో కొత్త రకం టైప్ 3సి డయాబెటిస్ మెల్లిటస్ ను గుర్తించింది. ఇది సాధారణ రకాల కంటే పూర్తిగా భిన్నం, ఎందుకంటే ఇది శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి వ్యవస్థను మాత్రమే కాదు, జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది.
టైప్ 3సి.. తేడా ఏంటి?
• టైప్ 1 డయాబెటిస్: ఇమ్యూన్ సిస్టమ్ తప్పుగా పాంక్రియాస్ పై దాడి చేసి ఇన్సులిన్ ఉత్పత్తి కణాలను ధ్వంసం చేస్తుంది.
• టైప్ 2 డయాబెటిస్: శరీర కణాలు ఇన్సులిన్‌కు ప్రతిస్పందించకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది.
• టైప్ 3సి డయాబెటిస్: ఇది పూర్తిగా పాంక్రియాస్ నేరుగా దెబ్బతినడం వల్ల ఏర్పడుతుంది. అంటే పాంక్రియాస్ లోని ఎండోక్రైన్ (ఇన్సులిన్ ఉత్పత్తి చేసే), ఎక్సోక్రైన్ (జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తి చేసే) భాగాలు రెండూ ప్రభావితమవుతాయి.
దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలోనే కాకుండా, ఆహారం జీర్ణమవ్వడంలో కూడా లోపాలు వస్తాయి.
కారణాలు
టైప్ 3సి డయాబెటిస్ కు ప్రధాన కారణం పాంక్రియాస్ దెబ్బతినడం. క్రానిక్ పాంక్రియాటైటిస్, పేగుల్లో ఇన్ ఫ్లమేషన్ వల్ల పాంక్రియాస్ కణజాలం దెబ్బతినడం, పాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడం, కొన్ని సందర్భాల్లో పాంక్రియాస్ భాగాన్ని సర్జరీ ద్వారా తొలగించాల్సి రావడం, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యు వ్యాధులు వల్ల పాంక్రియాస్ పనితీరు తీవ్రంగా దెబ్బతినడం వంటి కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా, జీర్ణ ఎంజైమ్స్ కూడా సరిపడా ఉత్పత్తి కావు. దాంతో ఒకవైపు బ్లడ్ షుగర్స్ పెరగడం, మరోవైపు పోషకాల లోపాలతో సతమతం అవుతారు.
డ్యుయల్ థెరపీ
టైప్ 3సి డయాబెటిస్ చికిత్స రెండు భాగాలుగా ఉంటుంది:
1. రక్త చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఇన్సులిన్ థెరపీ.
2. జీర్ణక్రియను సాధారణ స్థితికి తెచ్చేందుకు పాంక్రియాటిక్ ఎంజైమ్ రీప్లేస్‌మెంట్ థెరపీ .
ఈ రెండు చికిత్సలు సమాంతరంగా జరిగితేనే రోగి ఆరోగ్యం స్థిరపడుతుంది. సరైన డైట్ ప్లాన్, పోషకాహారం, మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్స్ కూడా అవసరం.