Haryana Couple Welcome a Son | పెళ్లాయ్యక తొలి కాన్పులోనే మగ పిల్లాడు పుట్టాలని చాలా మంది కలలు కంటారు. ఆ కల కొందరికే నెరవేరుతుంది. ఆ కల నెరవేరని వారు రెండో కాన్పులోనైనా కుమారుడు జన్మిస్తే బాగుండు అని అనుకుంటారు. రెండో కాన్పులో కూడా సాధ్యం కాకపోతే.. మూడు, నాలుగు కాన్పుల వరకు ఎదురుచూస్తారు. అప్పటికీ కూడా కుమారుడు జన్మించకపోతే.. ఇది మా తలరాత అని పిల్లలను కనడం మానేస్తారు. కానీ ఈ దంపతులు మాత్రం.. మగపిల్లాడి కోసం 11వ కాన్పు వరకు వేచి చూశారు. 10 మంది ఆడపిల్లలు జన్మించిన తర్వాత 11వ కాన్పులో వారసుడు జన్మించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరి ఈ దంపతుల గురించి తెలుసుకోవాలంటే హర్యానా వెళ్లాల్సిందే.
హర్యానా( Haryana )లోని జింద్ జిల్లాలోని ఉచానాకు చెందిన సంజయ్‌కు 19 ఏండ్ల క్రితం వివాహమైంది. ఆయన భార్య వయసు ప్రస్తుతం 37 ఏండ్లు. పెళ్లైన తర్వాత వరుసగా 10 మందిని అమ్మాయిలను కన్నారు. కానీ వారికి మగపిల్లాడు కావాలనే కోరిక బలంగా ఉండేది. అంతేకాకుండా… అమ్మాయిలందరూ కూడా తమకు తమ్ముడు కావాలని ఆరాటపడేవారు. దీంతో ఆ దంపతులు పిల్లలను కనడం మానేయకుండా మగపిల్లాడి కోసం ప్రయత్నించారు. చివరకు 11వ కాన్పులో సంజయ్ దంపతుల కల నెరవేరింది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరిన సంజయ్ భార్య 4వ తేదీన మగ పిల్లాడికి జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవ్. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యుడు నరవీర్ షియోరాన్ వెల్లడించారు.
అందుకే మగపిల్లాడు పుట్టే వరకు వేచిచూశాం..
ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. తమకు ఓ కుమారుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. మా కూతుర్లు కూడా తమ్ముడు కావాలని అడిగేవారు. అందుకే మగపిల్లాడు పుట్టే వరకు వేచిచూశాం. 11వ కాన్సులో అబ్బాయి పుట్టడం సంతోషంగా ఉంది. ఇక తనకు కొద్దిపాటి ఆదాయంతోనే అందర్నీ చదివిస్తున్నారు. ఏం జరిగినా ఆ దేవుడి దయతోనే జరుగుతుందని భావిస్తాను. ఉన్నంతలో సంతోషంగా ఉన్నాం. తన బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను. మొదటి కుమార్తె ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతుందని సంజయ్ తెలిపారు.
పెద్ద కుమార్తె సరినా(18) ఇంటర్, రెండో కుమార్తె అమృత 11వ తరగతి, సుశీలా ఏడో తరగతి, కిరణ్ ఆరో తరగతి, దివ్య ఐదో తరగతి, మన్నత్ మూడో తరగతి, కృతిక రెండో తరగతి, అమ్నిష్ ఒకటో తరగతి చదువుతుంది. మిగతా ఇద్దరు కుమార్తెలు ఇంకా బడికి పోవడం లేదు.
