Health tips | మీకు ఈ విషయం తెలుసా.. ఉదయాన్నే కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు..!

  • Publish Date - March 5, 2024 / 03:54 AM IST

Health tips: మనలో చాలా మందికి ఉదయంం లేవగానే వేడివేడిగా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. పొరపాటున ఒక్కరోజు ఏదైనా కారణంవల్ల కాఫీ తాగలేక పోయారంటే ఏదో కోల్పోయామన్న భావనలో ఉంటారు. కానీ ఉదయాన్నే కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖాళీ కడుపుతో కాఫీ తాగేవాళ్లు భవిష్యత్తులో అనేక ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిపుణులు వెల్లడించిన ప్రకారం ఆ దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఉదయాన్నే కాఫీ తాగితే కలిగే దుష్ర్పభావాలు

ఉదయం లేవగానే కాఫీ తాగడంవల్ల కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ పెరుగుతుంది. అదేవిధంగా కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఆందోళన, భయం పెరుగుతాయి. అంతేగాక రోజూ ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. విశ్రాంతిని, ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది..

కాఫీలో టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్‌, కాల్షియం సహా కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల శరీరం త్వరగా రోగాలబారిన పడుతుంది. కెఫీన్‌, యాసిడ్ స్థాయిల కలయిక కడుపుని చికాకుపెడుతుంది. దాంతో కడుపులో నొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్‌కు కారణమవుతుంది.

అలాగే ఖాళీ కడుపుతో కాఫీని తీసుకుంటే అందులోని కెఫిన్‌ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏదైనా తిన్న తర్వాత కాఫీని తాగితే మాత్రం పెద్దగా ప్రమాదమేమీ ఉండదని పేర్కొన్నారు. ఖాళీ కడుపుతో తాగినప్పుడు మాత్రమే కాఫీ ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. 

Latest News