విధాత: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది గుండె జబ్బుల వల్లే మరణిస్తున్నారు. ఏటా 17.9 మిలియన్ల మరణాలకు గుండెజబ్బులే కారణం. జాగ్రత్తగా ఉండాలని అందరికీ తెలుసు.. కానీ, తెలిసిన సమాచారంలో చాలా వరకు అపోహలే. ఏవి అపోహలో తెలుసుకోవడమే నిజమైన అవగాహన.
మధ్య వయస్సు దాటితేనే…
గుండెకు సంబంధించిన సమస్యలు మొదలవడానికి కనీసం మధ్య వయసుకైనా రావాలి అనే అపోహ చాలామందిలో ఉంది. యువకుల్లో గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు రావు అని అనుకుంటారు. కానీ సెడంటరీ లైఫ్ స్టయిల్, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం అసలు చెయ్యక పోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం వంటివన్నీ కూడా వయసుతో సంబంధం లేకుండా గుండె ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.
చిన్న వయస్సులోనే గుండె పోటు భారిన పడిన సందర్భాలు ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏ వయసు వారికైనా ఆరోగ్యం గురించిన శ్రద్ధ అవసరం. ప్రస్తుతం గుండె పోటు చాలా తరచుగా వినిపిస్తున్న విషయం. ఆరోగ్యకరమైన జీవన శైలీ అందరికీ అవసరమే.
రక్త సంబంధీకుల్లో గుండె సమస్య ఉంటే ఇక అంతే..
దగ్గరి రక్త సంబంధీకుల్లో గుండె జబ్బులు ఉన్నట్టయితే ఇక గుండె జబ్బులు రాకుండా ఆపలేము. రక్త సంబంధీకుల్లో గుండె జబ్బుల చరిత్ర ఉన్నపుడు హార్ట్ ఎటాక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండెజబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని అనడంలో అనుమానం లేదు.
కానీ జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు లేదా వాయిదా వెయ్యవచ్చు. పోషకాహారం తీసుకోవడం, తప్పకుండా వ్యాయామం చెయ్యడం, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడం, కనీసం ఏడాదికి ఒక్కసారి గుండె సంబంధిత అన్ని పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను కొంత వరకు పరిష్కారాన్ని మన చేతుల్లో ఉంచుకోవడచ్చు.
ప్రతీ నొప్పి హార్ట్ ఎటాక్…
చాలా సార్లు ఛాతిలో వచ్చే నొప్పి గుండె పోటు కాకపోవచ్చు. కేవలం గుండెల్లో వచ్చే నొప్పి మాత్రమే ప్రమాదకరం అనుకుంటే మాత్రం అది అపోహే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెల్లో మంట, పొత్తి కడుపులో నొప్పి, వికారంగా అనిపించడం, వాంతులు, వెన్ను నొప్పి, దవడ నొప్పి, కళ్లు తిరుగుతున్నట్టుగా ఉండడం, అలసట ఇలా రకరకాల లక్షణాలు గుండె పోటుకు ముందు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం.