intermittent fasting risks | ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ వల్ల లాభమా? నష్టమా? – కొత్త అధ్యయనం సంచలన వివరాలు

రోజుకు 8 గంటలకే ఆహారం పరిమితం చేసే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గుండె జబ్బులతో మరణించే ప్రమాదాన్ని 135% పెంచుతుందని కొత్త అధ్యయనం హెచ్చరిక.

intermittent fasting risks | ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య చర్చల్లో హాట్ టాపిక్‌గా మారింది విరామ ఉపవాసం(intermittent fasting). బరువు తగ్గడం, రక్తపోటు నియంత్రణ, చక్కెర స్థాయిలు తగ్గించడం, జీవనకాలం పెరగడం వంటి ప్రయోజనాలు కలిగిస్తుందని పలు అధ్యయనాలు సూచించడంతో, ఇది ఒక డైట్ ట్రెండ్గా మారింది. టెక్ నిపుణులు, హాలీవుడ్ స్టార్‌లు మాత్రమే కాకుండా, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా ప్రతి వారం 36 గంటల ఉపవాసంతో మొదలుపెడతానని చెప్పి ఈ పద్ధతిని ప్రాచుర్యం పొందేలా చేశారు. అయితే, తాజాగా వెలువడిన ఒక విస్తృత అధ్యయనం మాత్రం ఈ డైట్ పద్ధతికి సంబంధించిన కొత్త హెచ్చరికలు జారీ చేసింది.

విరామ ఉపవాసం(intermittent fasting) అంటే ఏమిటి?

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో 8 గంటల ఆహార పద్ధతి గుండె సంబంధిత మరణాల ప్రమాదం పెంచుతుందని తెలిపిన తాజా అధ్యయనం

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) అనేది రోజులో లేదా వారంలో కొన్ని గంటలు/రోజులు ఆహారం మానేసి, మిగిలిన సమయంలో మాత్రమే భోజనం చేసే ఆహార విధానం.

అమెరికాలో 19,000 మందిపై ఎనిమిదేళ్లపాటు నిర్వహించిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటపడ్డాయి. రోజుకు 8 గంటల లోపే ఆహారం తీసుకునే అలవాటు పాటించిన వారిలో, 12–14 గంటల వ్యవధిలో ఆహారం తీసుకునేవారితో పోల్చితే గుండె సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 135% ఎక్కువగా ఉందని తేలింది. పొగతాగే వారు, డయాబెటిస్ ఉన్నవారు, గుండె జబ్బులు కలిగినవారిలో ఈ రిస్క్ మరింత పెరిగిందని కూడా అధ్యయనంలో తేలింది.

ఇంతకు ముందు వచ్చిన తాత్కాలిక అధ్యయనాలు ఈ విధానం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచించినా, దీర్ఘకాలిక పరిశీలనలో మాత్రం విరుద్ధ ఫలితాలు వచ్చాయి. ఈ విషయాన్ని పరిశోధనకు నాయకత్వం వహించిన షాంఘై జియో టాంగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ విక్టర్ వెంజ్ జోంగ్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లో – “ఊహించని విషయమేమిటంటే, ఏళ్ల తరబడి ఎనిమిది గంటల విండోలో మాత్రమే తినే అలవాటు పాటించడం గుండె సంబంధిత మరణాల ప్రమాదంతో నేరుగా సంబంధముండటం”.

అయితే, నిపుణులు దీనిని పూర్తిగా వ్యతిరేకించడం లేదు. ఎండోక్రినాలజిస్ట్ అనూప్ మిశ్రా ప్రకారం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడం, రక్తపోటు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ, కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమబద్ధీకరించడం వంటి ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. కానీ దీర్ఘకాలం కొనసాగిస్తే పోషకాహార లోపాలు, రక్తంలో చక్కెర అసమతుల్యత, ఆకలి, చిరాకు, తలనొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

నిపుణుల అభిప్రాయాలు

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతి పూర్తిగా తప్పు కాదు. కానీ దీర్ఘకాలం పాటించినప్పుడు గుండె జబ్బుల ప్రమాదం పెరగవచ్చనే తాజా పరిశోధన హెచ్చరికను విస్మరించరాదు. వైద్యుల సలహా లేకుండా ఈ పద్ధతిని అనుసరించడం కన్నా, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా పాటించడం మంచిది.