విధాత హెల్త్ డెస్క్: “మెనోపాజ్” అనే పదం చాలామందికి మహిళలకి సంబంధించినదే అనుకుంటారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, పురుషుల శరీరంలోనూ వయస్సు పెరిగేకొద్దీ కొన్ని హార్మోన్ల మార్పులు జరిగి, అరుదైన ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. దీనినే పురుషుల మెనోపాజ్ లేదా వైద్య పరిభాషలో “అండ్రోపాజ్” (Andropause) అంటారు. ఇది స్పష్టంగా గుర్తించదగిన మార్పు కాకపోయినా, దీని ప్రభావం మానసిక, శారీరక స్థాయిలో బాగా కనిపించవచ్చు.
పురుషుల మెనోపాజ్(Male Menopause) అంటే ఏమిటి?
వాస్తవానికి “పురుషుల మెనోపాజ్” అన్నది వంద శాతం వైద్యపరంగా నిర్వచించబడిన పదం కాదు. కానీ ఇది “టెస్టోస్టెరోన్” అనే ముఖ్యమైన పురుష హార్మోన్ స్థాయిలు వయస్సుతో పాటు సహజంగా తగ్గిపోవడం వల్ల ఏర్పడే పరిస్థితులను సూచించేందుకు వాడతారు.
- మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక్కసారిగా తగ్గిపోతే, పురుషుల్లో టెస్టోస్టెరోన్ మెల్లమెల్లగా, ఏడాదికి సగటున 1% చొప్పున తగ్గుతుంది.
- ఈ మార్పులు నిజానికి 30 ఏళ్ల వయసు తర్వాతే ప్రారంభమవుతాయని, అయితే స్పష్టమైన లక్షణాలు 50-60 ఏళ్ల వయస్సులో మాత్రమే బయటపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
టెస్టోస్టెరోన్ హార్మోన్ పాత్ర ఏమిటి?
టెస్టోస్టెరోన్ పురుషుల శరీరంలో ప్రధాన హార్మోన్. ఇది:
- లైంగిక చురుకుదనం (libido)
- మూడ్ స్థిరత్వం
- కండరాల బలము
- ఎముకల ధృడత్వం
- తక్కువ శరీర కొవ్వు
- వీర్యకణాల ఉత్పత్తి
- జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను ప్రభావితం చేస్తుంది.
ఈ హార్మోన్ తక్కువైతే, శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా దుష్ప్రభావాలు కనబడతాయి.
పురుషుల మెనోపాజ్ లక్షణాలు ఇవే:
- శరీర బరువు పెరగడం, ప్రత్యేకంగా పొట్ట చుట్టూ కొవ్వు.
- ఛాతీ కండరాలు మృదువుగా మారడం (gynecomastia లాంటివి).
- మానసిక అలసట, కుంగుబాటు() లక్షణాలు.
- లైంగిక కోరిక తగ్గిపోవడం, ఈడీ సమస్యలు.
- మూడ్ స్వింగ్స్, నిద్రలేమి.
- ఏకాగ్రత లోపం, ఉత్సాహహీనత.
- మతిమరుపు, డెమెన్షియా అనుభూతి.
గమనించాల్సిన అంశమేంటంటే, ఇవన్నీ ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా కనిపించాలనేంలేదు. టెస్టోస్టెరోన్ తక్కువున్నా లక్షణాలు లేకపోవచ్చు. కేవలం పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారణ సాధ్యం.
ఎలా గుర్తించాలి? పరీక్షలు ఏవి?
- రక్త పరీక్ష (Serum Testosterone Test) – ఉదయం 7AM–10AM మధ్య చేయాలి. హార్మోన్ స్థాయిలు రోజు పొడవునా మారుతూ ఉంటాయి.
- రెండు సార్లు పరీక్ష అవసరం – ఒకసారి వచ్చిన ఫలితం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం తగదు.
- సాధారణ స్థాయి: 300 – 1000 నానోగ్రామ్ / డెసిలీటర్. అయితే ఇది వ్యక్తికి అన్వయించాల్సిన రేంజ్. అందుకే లక్షణాలతో పాటు పరీక్షలు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
చికిత్స మార్గాలు ఏమిటి?
- టెస్టోస్టెరోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (TRT):
టెస్టోస్టెరోన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు, వైద్యుని సలహా మేరకు హార్మోన్ చికిత్స ప్రారంభించవచ్చు. ఇది జెల్, ఇంజెక్షన్, లేదా ప్యాచ్ రూపంలో అందుతుంది.
- జీవనశైలి మార్పులు:
- తప్పనిసరిగా వ్యాయామం చేయడం
- అధిక ప్రొటీన్ ఆహారం తీసుకోవడం
- సరిపడా నిద్రపోవడం
- మద్యం తగ్గించడం
- ఒత్తిడిని అధిగమించడం
- మానసిక ఆరోగ్యం:
మూడ్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు సైకాలజిస్టు లేదా కౌన్సిలింగ్ ద్వారా సహాయం తీసుకోవచ్చు.
“పురుషుల మెనోపాజ్” అనే పదం వినగానే కొంతమంది నవ్వుకుంటారు గానీ ఇది పూర్తిగా హార్మోన్ల అసమతుల్యతతో కూడిన శరీర స్థితి. దీన్ని మానసికంగా అంగీకరించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, వైద్యుని సలహాతో ముందడుగు వేయడం ఎంతో అవసరం.