Site icon vidhaatha

ఉమ్మడి నల్గొండలో మోతాదుకు మించి ‘ఫ్లోరైడ్’.. పరిశోధనల్లో విస్తూపోయే నిజాలు

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య సజీవంగానే ఉందన్న చేదు నిజం ఉస్మానియా జువాలజీ విభాగం పరిశోధనలలో తేటతెల్లమైంది. జిల్లాలో 1,108 ఆవాస గ్రామాల్లో 19 లక్షల మంది ఫ్లైరైడ్ బాధితులు ఉన్నారని ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎస్.జితేందర్ కుమార్ తెలిపారు.

మోతాదుకు మించి…

తెలంగాణలో అత్యధికంగా ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుగా గుర్తించబడిన నార్కెట్ పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం, చెరువుగట్టు, దాసరిగుడెంలలో, అటు ఫ్లోరైడ్ తక్కువగా నమోదైన మోటుబావి గూడెం, మిర్లోని గూడెం, బట్టుపోతల గూడెంతో పాటు ఎంపిక చేసిన గ్రామాల్లో నీటి నమూనాలను సేకరించి ఫ్లోరైడ్ ప్రభావాన్నిపరిశీలించడం జరిగిందన్నారు.

“బయో కెమికల్, సైటో జెనెటిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఎండమిక్ ఫ్లోరైడ్ ఆఫ్ నల్గొండ జిల్లా” అనే అంశంలో భాగంగా జరిగిన పరిశోధనలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రతను గుర్తించామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 0.5 పిపిఎం మోతాదుకు మించి నార్కెట్ పల్లి మండలంలోని ఆయా మూడు గ్రామాల్లో ఫ్లోరైడ్ తీవ్రత అధికంగా ఉందన్నారు.

జిల్లాలో కొన‌సాగుతున్న ఫ్లోరైడ్ తీవ్ర‌త‌

జిల్లాలో ఓయూ జువాలజీ డిపార్ట్మెంట్ తాజా పరిశోధనల నేపధ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రత ఇంకా కొనసాగుతుందన్న విషయానికి బలం చేకూరింది. అయితే ఆ మధ్య పార్లమెంట్ లో కేంద్రం తెలంగాణలో కొత్తగా ఫ్లోరైడ్ కేసులు నమోదు కాలేదని చెప్పడం విదితమే.

అలాగే రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం పలు సందర్భాల్లో మిషన్ భగీరథ పథకం తో పాటు కొత్తగా చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులతో జిల్లాలో ఫ్లోరైడ్ నుండి బాధిత ప్రాంతాలను విముక్తి చేశామని ప్రచారం చేసుకోవడం గమనార్హం.

ఫ్లోరైడ్ నిర్ధార‌ణ‌కు స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టాలి..

జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రతపై కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మాటలకు భిన్నంగా తాజా పరిశోధనలలో జిల్లా ఫ్లోరైడ్ సమస్య మరోసారి నిర్ధారణ కావడం చర్చనీయాంశమైంది. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రత కొనసాగుతున్నందున మరోసారి ప్రభుత్వాలు ఫ్లోరైడ్ కేసుల నిర్ధారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని, బాధితులను గుర్తించి, వారికి అవసరమైన వైద్య సదుపాయాలు.. పింఛన్ వసతులు కల్పించాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది.

అటు కేంద్రం కూడా మల్కాపూర్ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు విషయమై తక్షణ చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంది.

Exit mobile version