Site icon vidhaatha

వయసు 40 దాటిందా? కంటి చూపు జాగ్రత్త!

విధాత‌: వయసు 40 ల్లో పడగానే నెమ్మదిగా ఆరోగ్య సమస్యలు ఒకటొకటిగా మొదలవుతుంటాయి. మధ్య వయసుకు చేరినట్టు ఎవరిది వాళ్లకు అర్థమవుతూనే ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ప్రారంభిస్తారు. నెమ్మదిగా లైఫ్ స్టయిల్ మార్పులు కూడా చేసుకుంటూ ఉంటారు.

అయితే ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్, గుండె ఆరోగ్యాలతో పాటు మరో విషయం గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. అదే కంటి చూపు. చూపు మందగించడం కూడా చాలా సాధారణం. అప్పటి వరకూ లేని అద్దాలు ముఖాన చేరుతాయి. ఏ చత్వార సమస్యో అయినపుడు ఫర్వాలేదు.

కానీ కంటి చూపు కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయన్న అవగాహన చాలా తక్కువ మందిలో ఉంటుంది. మనకు తెలియకుండానే గుర్తించేలోగానే కంటి చూపును దోచుకునే దొంగ నీటి కాసులు దీన్నే గ్లకోమా అంటారు.

గ్లకోమాలో ఏమవుతుంది?

గ్లకోమా సమస్య మొదలైందని ప్రాథమిక దశలో గుర్తించడం దాదాపు అసాధ్యం. ఇది కంటి చూపు పరిధిని నెమ్మదిగా తగ్గిస్తూ పోతుంది. చికిత్స తీసుకోక పోతే కంటి చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. గ్లకోమా విషయంలో శాశ్వత నష్టం జరిగే వరకు సమస్యను గుర్తించేవాళ్లు చాలా తక్కువ.

మనకు రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగితే బీపీ వస్తుందని తెలుసు, అలాగే కంటిలోని ఆప్టిక్ నర్వ్ మీద ఒత్తిడి పెరిగితే వచ్చేది గ్లకోమా. దీని కోసం 40 వయసు దాటిన వారు కనీసం ఏడాదికి ఒకసారి తప్పకుండా ఆప్టిక్ నర్వ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం అవసరం. దీన్నే గ్లకోమా స్ర్కీనింగ్ టెస్ట్ అంటారు.

ఈ లక్షణాలుంటే జాగ్రత్త

ఫ్యామిలీ హిస్టరీలో గ్లకోమా ఉన్నవారు, డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్త పడాలి. అంతేకాదు, ఒత్తిడి, తీక్షణమైన సూర్య కాంతి, కంటి మీద పడే డిజిటల్ ప్రెషర్ కూడా చూపు మందగించేందుకు కారణం కావచ్చు.

నివారణ సాధ్యమే

గ్లకోమా ప్రమాదాన్ని నివారించవచ్చు. అందుకు అవగాహన కలిగి ఉండడం అవసరం. కంటి ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. క్రాన్ బెర్రీ, బ్లాక్ లేదా గ్రీన్ టీ, అవిసెగింజలు, దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి తీసుకుంటే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.

కేవలం గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు కంటి ఆరోగ్యానికి కూడా వ్యాయామం చెయ్యాలి. కుటుంబంలో గ్లకోమా ఉన్నవారు తప్పకుండా క్రమశిక్షణతో సమయానికి నిద్ర, ఆహారం, వ్యాయామం ఉండేలా జీవనశైలి రూపొందించుకోవాలి. యోగా, మెడిటేషన్ ఎప్పుడూ ఆరోగ్య రక్షణలో ముందుండేవి.

గ్లకోమా వల్ల తగ్గిన దృష్టిని తిరిగి సాధించడం అసాధ్యం. కనుక నివారణ దిశగా అడుగులు వెయ్యడమే సబబు. ఆప్టిక్ నర్వ్ లో కనుక ప్రెషర్ ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఇలా వాడితే చూపును వీలైనన్ని ఎక్కువ రోజులు కాపాడుకునే అవకాశం ఉంటుంది.

బరువు అదుపులో ఉంచుకోవడం..

బరువు అదుపులో ఉంచుకోవడం కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పోగతాగడం మానెయ్యాలి. నోటి శుభ్రత మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాథమిక స్థాయిలో కంటికి సంబంధించిన సమస్యలు త్వరగా గుర్తించడం కష్టం కనుక కుటుంబంలో కంటి సమస్యలు ఉన్న వారు గ్లకోమ, శుక్లాలు, డయాబెటిక్, రెటినోపతి వంటి సమస్యలకు సంబంధించిన పరీక్షలు తరచుగా చేయించుకోవడం మాత్రమే దీనికి పరిష్కారం. కనుక 40 వయసు పైబడిన వారు ఏడాదికి ఒకసారైన కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమే.

Exit mobile version