Ground Water | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరాన్ని ఈ సీజన్‌లో భారీ వర్షాలు( Heavy Rains ) ముంచెత్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు( Downpour ) కురిశాయి. ఈ భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. అంతే కాదు.. భారీ వర్షాలు, వరదల కారణంగా భాగ్యనగరంలో గణనీయంగా భూగర్భ జలాలు( Ground Water ) కూడా పెరిగాయి.
ఈ సీజన్‌లో 2 నుంచి 3 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయని భూగర్భ జల వనరుల శాఖ తెలిపింది. గతంతో పోల్చితే నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి వర్షాలు సరిగా లేవు. అయితే జూన్ నెలలో సాధారణంగా 96.3 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ కేవలం 28.4 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో బండ్లగూడ, ఆసిఫ్ నగర్, బహదూర్‌పురా, చార్మినార్, హిమాయత్ నగర్, గోల్కొండ, అంబర్‌పేట్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్, తిరుమలగిరిలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో.. తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. దీంతో భూగర్భ జలాలు సరిగా లేక.. నగరంలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది.
ఇక జులై మాసం నుంచి భారీ వర్షాలు కురిశాయి. సాధారణంగా 269.3 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండే. కానీ 6 శాతం తేడాతో 251.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జులై 1 నుంచి జులై 28 మధ్య ఈ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా ఊహించని విధంగా కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు 2 నుంచి 4 మీటర్ల వరకు పెరిగాయి. మారేడ్ పల్లి, బండ్లగూడ, చార్మినార్, హిమాయత్ నగర్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ఏరియాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.
వాటర్ ట్యాంకర్లకు తగ్గిన డిమాండ్
జులై నుంచి సెప్టెంబర్ వరకు భారీ వర్షాల కారణంగా.. నగరంలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ తగ్గినట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి నెల(వేసవి కాలం తప్ప) 4 వేల నుంచి 6 వేల వరకు వాటర్ ట్యాంకర్లను నగర వాసులు బుకింగ్ చేసుకునే వారు. కానీ ఆ సంఖ్య 2500 నుంచి 3 వేలకు తగ్గినట్లు పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరగడం వల్లే ఈ సంఖ్య తగ్గిందన్నారు.