హనుమకొండ :
మొంథా తుఫాను (Montha Cyclone) ప్రభావిత ప్రాంతాల్లో నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం మంత్రులతో కలసి పర్యటించారు. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన గ్రామాల్లో బాధితులను కలసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ వినతిపత్రాలు ముఖ్యమంత్రికి అందజేశారు. తరువాత హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాను తో నష్టపోయిన వాళ్లను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం ప్రకృతి విపత్తుల సమయంలో నష్టపోయిన ప్రతి ఎకరా పంటకు రూ.10వేలు, ఇండ్లు మునిగిన బాధితులకు రూ.15 వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. అలాగే, గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తుఫానుతో సంభవించిన నష్టాలపై పూర్తి స్థాయి అంచనా వేయాలని ఆయన అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాణనష్టం, పంటనష్టం, పశుసంపద నష్టం, రహదారులు, వంతెనలు, ప్రభుత్వ భవనాలు, విద్యుత్ సరఫరా వంటి అన్ని విభాగాల నష్టాలపై స్పష్టమైన నివేదికలు సిద్ధం చేయాలి అని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చేతులు ముడుచుకోవద్దని హెచ్చరిస్తూ, ప్రతి మంత్రి, కలెక్టర్ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు వివరాల రిపోర్ట్ ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు సీఎం తెలిపారు. నష్టంపై కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే రాబట్టుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం నిధుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలి అని సీఎం అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు కలసి పనిచేయాలని సూచించారు. నాలాల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఎంతటివారైనా కబ్జాలు తొలగించాలన్నారు. పది మంది కోసం పదివేల మంది నష్టపోవడం అన్యాయం అని స్పష్టం చేశారు. అలాగే, వరదలు తగ్గిన వెంటనే శానిటేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. స్మార్ట్ సిటీ పనులను ఎక్కడా ఆపకూడదని, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రేవంత్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పులతో “క్లౌడ్ బరస్ట్”లు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘అధికారులు నిర్లక్ష్యం వదిలి.. కార్యాలయాల్లో కూర్చోకుండా..క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులు అంచనా వేయాలి. కలెక్టర్లు స్వయంగా ఫీల్డ్ విజిట్లు చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
