Site icon vidhaatha

BANGLADESH | ఆపద్ధర్మ ప్రభుత్వానికి నోబెల్‌ పురస్కార గ్రహీత మహ్మద్‌ యూనస్‌ సారథ్యం?

ఢాకా: షేక్‌ హసీనా రాజీనామా, పార్లమెంటు రద్దు, ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాల నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి సారథ్యం ఎవరు వహించాలన్న చర్చ మొదలైంది. అయితే.. విద్యార్థి ఉద్యమ నేతలు మాత్రం నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహ్మద్‌ యూనస్‌ ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఉద్యమ సమన్వయ కర్తల్లో ఒకరైన నహీద్‌ ఇస్లాం ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అందులో ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధానిగా మహ్మద్‌ యూనస్‌ ఉండాలని ప్రతిపాదించారు. తాము ఇప్పటికే ఆయనతో మాట్లాడామని, బంగ్లాదేశ్‌ను కాపాడేందుకు బాధ్యతలు తీసుకునేందుకు ఆయన అంగీకరించారని ఇస్లాం వెల్లడించారు. ‘విద్యార్థులు ప్రతిపాదించేవారు తప్ప వేరే ఏ ప్రభుత్వాన్ని ఆమోదించేది లేదు. మిలిటరీ ప్రభుత్వం లేదా మిలిటరీ మద్దతుతో ఉన్న ప్రభుత్వాన్ని లేదా ఫాసిస్టు ప్రభుత్వాన్ని మేం అంగీకరించేది లేదని ఇప్పటికే చెప్పాం’ అని నహీద్‌ స్పష్టం చేశారు. ఆ వీడియోలో నహీద్‌ వెంట మరో ఇద్దరు సమన్వయకర్తలు కూడా ఉన్నారు. మహ్మద్‌ యూనస్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో లేరు. కానీ.. హసీనా ప్రభుత్వం తొలగింపును ఆయన సమర్థించారు. ఈ పరిణామాన్ని ఆయన ‘దేశ రెండో విమోచన’గా అభివర్ణించారు.
గ్రామీణ బ్యాంకు ద్వారా దారిద్ర్య నిర్మూలనకు చేసిన కృషికిగాను 2006లో మహ్మద్‌ యూనస్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. తదుపరి కాలంలో ఈ నమూనాను అనేక దేశాలను అనుసరించాయి. ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు ఆయన అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయిన డైలీ స్టార్‌ పత్రిక పేర్కొన్నది. ‘విద్యార్థులు ఎంతో త్యాగం చేశారు. దేశ ప్రజలు ఎంతో త్యాగం చేశారు. అందుకే నాకూ కొంత బాధ్యత ఉన్నది. అందుకే నేను బాధ్యత తీసుకుంటానని విద్యార్థి ఉద్యమ నాయకులు చెప్పాను’ అని యూనస్‌ చెప్పారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
2008లో హసీనా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ వరుస దర్యాప్తుల పేరిట యూనస్‌ను ప్రభుత్వం వేధించింది. అప్పటి నుంచీ హసీనా ప్రభుత్వంతో ఆయన వివాదంలో ఉన్నారు. ఆయనపై పదులకొద్దీ అభియోగాలు మోపారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించారంటూ జనవరిలో ఆయనకు ఒక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది.
ఇదిలా ఉంటే.. సోమవారం హసీనా దేశం వదిలి పారిపోయిన తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో దాదాపు వంద మంది చనిపోయారు. దీంతో మొత్తంగా ఈ ఆందోళనల్లో చనిపోయినవారి సంఖ్య 440కి పెరిగింది. అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్‌లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ.. మంగళవారం పరిస్థితులు కొద్దిగా మెరుగయ్యాయి. మంగళవారం ఢాకాలో శాంతియుత పరిస్థితే కనిపించిందని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ పనిచేసింది. పలువురు దుకాణదారులు తమ షాపులను తెరిచారు. పలు బ్యాటరీ ఆధారిత రిక్షాలు కూడా రోడ్లపై తిరిగాయి.

బంగ్లాదేశ్‌ పోలీస్‌ చీఫ్‌గా షాహిదుర్‌ రహమాన్‌
బంగ్లాదేశ్‌ పోలీస్‌ ఫోకల్‌ పర్సన్‌గా అదనపు ఐజీపీ ఏకేఎం షాహిదుర్‌ రెహమాన్‌ నియమితులయ్యారు. ఈ సంక్షోభ కాలంలో పోలీసు దళాల సమన్వయకర్తగా ఆయన వ్యవహరించనున్నారు.

Exit mobile version