చైనా షింజో-17 ప్ర‌యోగం విజ‌య‌వంతం.. అంత‌రిక్షంలోకి ముగ్గురు వ్యోమ‌గాములు

  • Publish Date - October 26, 2023 / 10:31 AM IST

చైనా (China) త‌న అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో కీల‌క ముంద‌డుగు వేసింది. గ‌తంతో పోలిస్తే అత్యంత చిన్న వ‌య‌సున్న టాకియోన‌ట్స్ (వ్యోమ‌గాములు)ను అంత‌రిక్షంలోకి పంపింది. మొత్తం ముగ్గురు వ్యోమ‌గాములు ఈ ప్ర‌యోగంలో పాలుపంచుకున్నారు. గురువారం వీరు ఉన్న డివైన్ వెసెల్ అని పిలుచుకునే షింజో -17 అనే మాడ్యుల్‌ను తీసుకుని లాంగ్ మార్చ్ – 2ఎఫ్ నింగిలోకి దూసుకెళ్లింది. వాయ‌వ్య చైనాలోని జియాక్వ‌న్ శాటిలైట్ లాంచ్ సెంట‌ర్ నుంచి ఈ ప్ర‌యోగం జ‌రిగింది.


చైనా సొంతంగా రూపొందించుకున్న‌తియాగాంగ్ స్పేష్ స్టేష‌న్‌లో వీరంతా ఆరు నెల‌ల పాటు ప‌రిశోధ‌న‌లు చేయ‌నున్నారు. ఈ మిష‌న్‌కు ఎయిర్‌ఫోర్స్ మాజీ పైల‌ట్ టాంగ్ హాంగ్‌బో (48) నేతృత్వం వ‌హిస్తారు.. ఈయ‌న‌తో పాటు ఉన్న టాంగ్ షెంగ్జీ, జియాంగ్ క్సిన్లిన్ ల వ‌య‌సు వ‌రుస‌గా 33, 35 కావ‌డం విశేషం. మ‌రోవైపు చైనా త‌న మాన‌వ‌స‌హిత అంత‌రిక్ష‌యాత్ర‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.


ర‌ష్యా, అమెరికాల అధీనంలో ఉన్న అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)కు పోటీగా తియాగాంగ్ స్పేస్ స్టేష‌న్‌ను ఇప్ప‌టికే ఏర్పాటు చేసుకున్నవిష‌యం తెలిసిందే. ఈ ప్ర‌యోగంతో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు మూడు బృందాల‌ను ఆరు సార్లు అక్క‌డ‌కు పంపింది. అయితే ఇప్పుడు వెంట‌నే నాలుగో బ్యాచ్ వ్యోమ‌గాముల‌ను పంప‌డానికి ప్ర‌క‌ట‌న సైతం విడుద‌ల చేసింది. బ‌యాల‌జీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్‌, ఆస్ట్రాన‌మీ, త‌దితర రంగాల్లో డాక్ట‌రేట్ చేసిన వారి నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. హాంకాంగ్‌, మ‌కావూ పౌరులు కూడా ద‌ర‌ఖాస్తు చేయొచ్చ‌ని ప్ర‌క‌టించింది.

Latest News